Jailer 2 Box Office: ‘జైలర్ 2’ బాక్సాఫీస్ విధ్వంసం.. రెండు రోజుల్లోనే రూ.209 కోట్ల వసూళ్లు..!

Jailer 2 Box Office: ‘జైలర్ 2’ బాక్సాఫీస్ విధ్వంసం.. రెండు రోజుల్లోనే రూ.209 కోట్ల వసూళ్లు..!

సూపర్‌స్టార్ రజనీకాంత్ మరోసారి తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో నిరూపించారు. భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చిన ‘జైలర్ 2’ ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలైన రెండో రోజుకే రూ.200 కోట్ల మార్కును దాటేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. అయితే తొలి రోజుతో పోలిస్తే భారత్‌లో వసూళ్లు తగ్గడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఓవర్సీస్ మార్కెట్‌లో సినిమా దూకుడు మాత్రం కొనసాగుతోంది.

రెండు రోజుల్లోనే రూ.209.10 కోట్ల గ్రాస్!

రజనీకాంత్- నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబోలో వచ్చిన ‘జైలర్ 2’ అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజు నుంచే భారీ వసూళ్లతో దూసుకెళ్తున్న ఈ చిత్రం, రెండో రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.209.10 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ మొత్తం వసూళ్లలో భారత్ నుంచి రూ.112.10 కోట్ల గ్రాస్ నమోదవగా, విదేశీ మార్కెట్ల నుంచి రూ.97 కోట్ల గ్రాస్ వచ్చినట్లు సమాచారం. ముఖ్యంగా ఓవర్సీస్ ప్రేక్షకుల నుంచి లభిస్తున్న ఆదరణ సినిమాకు గ్లోబల్ స్థాయిలో భారీ బలంగా మారింది.

రెండో రోజు ఇండియాలో రూ.35.60 కోట్ల నెట్..

తొలి రోజు ఇండియాలో రూ.59.70 కోట్ల నెట్ వసూళ్లు సాధించిన ‘జైలర్ 2’, రెండో రోజు శుక్రవారం రూ.35.60 కోట్ల నెట్ వసూళ్లను నమోదు చేసింది. దీంతో మొదటి రోజుతో పోలిస్తే దేశీయ వసూళ్లు సుమారు 40.4 శాతం తగ్గాయి. అయితే ఈ తగ్గుదల ఉన్నప్పటికీ సినిమా బాక్సాఫీస్ జర్నీ బలంగానే కొనసాగుతోంది. రెండో రోజు దేశవ్యాప్తంగా 13,157 షోల ద్వారా ఈ వసూళ్లు నమోదైనట్లు నివేదికలు పేర్కొన్నాయి. తొలి రోజు 16,599 షోలు ప్రదర్శించగా, రెండో రోజు షోల సంఖ్య కూడా తగ్గడం గమనార్హం. ముఖ్యంగా ఈ వీకెండ్ వసూళ్ల ప్రభంజనం మరింత ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉన్నట్లుగా సినీ వర్గాలు చెబుతున్నాయి. 

ఇండియాలో తమిళ వెర్షన్‌దే హవా..

ఇండియా బాక్సాఫీస్ వద్ద ‘జైలర్ 2’ తమిళ వెర్షన్ లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ వస్తున్నాయి. రెండో రోజైన శుక్రవారం భాషలవారీగా నమోదైన నెట్ వసూళ్లను గమనిస్తే.. 

    తమిళం: రూ.25.25 కోట్లు

    తెలుగు: రూ.7.25 కోట్లు

    హిందీ: రూ.2.75 కోట్లు

    కన్నడ: రూ.35 లక్షలు

ఈ వసూళ్ల లెక్కలను బట్టి తమిళ మార్కెట్‌లో రజనీకాంత్‌కు ఉన్న క్రేజ్ మరోసారి స్పష్టమవుతోంది. తెలుగు వెర్షన్ కూడా భారీ వసూళ్లు సాధించగా, హిందీ మార్కెట్‌లో మాత్రం ఆశించిన స్థాయిలో ఆక్యుపెన్సీ కనిపించలేదని అంటున్నారు ట్రేడ్ వర్గాలు..

ఓవర్సీస్‌లో అసలైన రచ్చ.. ఒక్క రోజే రూ.40 కోట్లు..

‘జైలర్ 2’ ప్రపంచవ్యాప్త వసూళ్లలో విదేశీ మార్కెట్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. రెండో రోజు ఒక్కటే ఓవర్సీస్ నుంచి రూ.40 కోట్ల గ్రాస్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో రెండు రోజుల్లో ఓవర్సీస్‌లో మొత్తం గ్రాస్ వసూళ్లు రూ.97 కోట్లకు చేరాయి. తొలి రోజు ఓవర్సీస్‌లో రూ.55 కోట్ల గ్రాస్ సాధించినట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలోనే ‘జైలర్ 2’ ప్రపంచవ్యాప్తంగా రూ.209 కోట్ల మార్కును రెండురోజుల్లోనే అందుకుంది. 

►ALSO READ | Garividi Lakshmi Review: బుర్రకథల వైభవం.. ‘గరివిడి లక్ష్మి’ జీవితం తెరపై ఎలా ఉందంటే?

ముందున్న అసలైన పరీక్ష వీకెండ్!

రెండు రోజుల్లోనే రూ.209.10 కోట్ల ప్రపంచవ్యాప్త గ్రాస్ సాధించిన ‘జైలర్ 2’కు ఇప్పుడు వారాంతపు వసూళ్లు అత్యంత కీలకం. శనివారం, ఆదివారం కలెక్షన్లు పెరిగితే సినిమా బాక్సాఫీస్ జోరు మరింత బలపడే అవకాశం ఉంది. అదే సమయంలో దేశీయ వసూళ్లలో కనిపించిన తగ్గుదల కొనసాగుతుందా, లేక వారాంతపు సెలవులతో మళ్లీ పుంజుకుంటుందా అన్నది చూడాలి.

మొత్తానికి, ఓవర్సీస్ మార్కెట్‌లో భారీ వసూళ్లు.. తమిళనాడులో బలమైన ఆదరణ.. తెలుగు రాష్ట్రాల్లో గణనీయమైన కలెక్షన్లతో ‘జైలర్ 2’ బాక్సాఫీస్ వద్ద తన ప్రభావాన్ని చూపిస్తోంది. ఇప్పుడు అందరి చూపు వీకెండ్ వసూళ్లపైనే ఉంది. రజనీకాంత్ ఈ జోరును కొనసాగించి మరో భారీ రికార్డును సొంతం చేసుకుంటారా? వేచి చూడాలి...