కొంతమంది నటులు సినిమాల్లో హీరోలుగా కనిపిస్తారు. కానీ మరికొందరి జీవితాలే సినిమాలకు కథలుగా మారతాయి. అలాంటి అరుదైన వ్యక్తిత్వాల్లో సూపర్ స్టార్ రజినీకాంత్ ఒకరు. బెంగళూరులో సాధారణ బస్ కండక్టర్ జీవితం ప్రారంభించిన ఆయన, భారతీయ సినీ చరిత్రలో అత్యంత ప్రజాదరణ పొందిన నటుడిగా ఎదిగిన ప్రయాణం ఇప్పటికే కోట్లాది మందికి స్ఫూర్తి.
ఇప్పుడు అదే ప్రయాణాన్ని ఆయన స్వయంగా ఆత్మకథ రూపంలో ప్రపంచానికి అందించబోతున్నారనే వార్త మరోసారి చర్చనీయాంశంగా మారింది. కొంతకాలంగా రజనీకాంత్ తన జీవిత అనుభవాలను పుస్తకంగా రాస్తున్నారనే ప్రచారం కోనసాగుతోంది. వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఒడిదొడుకులు, సినీ కెరీర్లో సాధించిన విజయాలు, స్టార్ వెనుక దాగి ఉన్న పోరాటం, తనను తీర్చిదిద్దిన అనుభవాలు వంటి ఎన్నో అంశాలను ఈ ఆత్మకథలో పొందుపరచనున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ ఆత్మకథను కేవలం పుస్తకంగానే కాకుండా వెండితెరపై కూడా ఆవిష్కరించాలనే ఆలోచన చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి వుంది. మరోవైపు రజినీకాంత్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. నెల్సన్ దీలీప్ కుమార్ డైరెక్షన్లో "జైలర్ 2'తోపాటు కమల్ హాసన్ బ్యానర్లో 'ధర్మవ్' చిత్రంలో నటిస్తున్నారు..
