కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్, విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) మరోసారి తన విభిన్న ఆలోచనలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. పండుగైనా, పబ్బమైనా అందరిలా విష్ చేయడం వర్మకి అస్సలు నచ్చదు. అందుకే ఈ రక్షాబంధన్ వేళ.. దశాబ్దాలుగా వింటున్న ఒక పాపులర్ సామెతపై తనదైన మార్క్ పంచ్ వేశారు.
ఆర్జీవీ లాజిక్..
సాధారణంగా "ప్రతి విజయవంతమైన పురుషుడి వెనుక ఒక స్త్రీ ఉంటుంది'అనే మాటను తరచూ వింటుంటాం. కానీ ఈ సామెతను వర్మ మాత్రం పూర్తిగా తోసిపుచ్చారు. తనదైన శైలిలో తన ఎక్స్ ఖాతాలో.. "విజయవంతమైన ప్రతి పురుషుడి వెనుక స్త్రీ (భార్య) ఉండదు" ( Behind every successful MAN there’s NO WOMAN (wife) ) అంటూ ఒక మైండ్ బ్లాకింగ్ పోస్ట్ పెట్టారు. తన వాదనకు బలం చేకూర్చేందుకు వర్మ దేశంలోని దిగ్గజాల జాబితాను ఉదహరిస్తూ లిస్ట్ ను పోస్ట్ చేశారు.
భార్య లేని వారి లిస్ట్ లో..
వారిలో ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ, దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం, రతన్ టాటా, బాలీవుడ్ సుల్తాన్ సల్మాన్ ఖాన్, యోగా గురువు బాబా రాందేవ్ పేర్లు ప్రస్తావించారు. వీరంతా సింగిల్స్‌గా ఉంటూనే ప్రపంచంలోనే అత్యున్నత శిఖరాలను చేరుకున్నారని ఆర్జీవీ ల్యాండ్ మార్క్ కామెంట్స్ చేశారు.
నెటిజన్ల కౌంటర్లు...
ఈ పోస్ట్ బయటకు రాగానే సోషల్ మీడియా రెండుగా విడిపోయింది. కొందరు వర్మ చెప్పింది 100% నిజం, పెళ్లి కాకపోతేనే కాన్సంట్రేషన్ అంతా సక్సెస్ మీదుంటుంది అని సమర్థిస్తున్నారు... మరికొందరు మాత్రం విపరీతంగా కౌంటర్లు వేస్తున్నారు. "అయ్యా వర్మా.. ఈ గ్రేట్ సింగిల్స్ లిస్టులో మీరెక్కడున్నారు?" అని కొందరు సెటైర్లు వేస్తుంటే, మరికొందరు 'ఇది పక్కా పురుషాధికార మైండ్ సెట్‌ను ప్రోత్సహించే వ్యాఖ్య" అని మండిపడుతున్నారు.
ఏదేమైనా, విజయానికి వివాహ బంధంతో సంబంధం లేదని, సింగిల్‌గా ఉన్నవారే హిస్టరీ క్రియేట్ చేస్తున్నారని వర్మ చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.
