
ఈ మద్య కాలంలో సెన్సార్ బోర్డు నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. సెన్సార్ చేయాల్సిన అంశాలను చేయకుండా.. ఎలాంటి వివాదం లేని.. అభ్యంతరం లేని అంశాలపై సెన్సార్షిప్ విధిస్తుందంటూ విమర్శలకు వస్తున్నాయి. అలాంటి వివాదమే మరోసారి మొదలైంది. ఏకంగా హైకోర్టుకు వెళ్లే వరకు వచ్చింది పరిస్థితి.
మళయాల స్టార్ సురేష్ గోపీ, అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్ లో నటించిన 'జెఎస్కె - జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ' సినిమాలో 'జానకి' పేరుపై సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. సినిమా టైటిల్, డైలాగ్స్ నుండి 'జానకి' అనే పేరును తొలగించాలని ఆదేశిస్తూ, CBFC చిత్రనిర్మాతలకు షోకాజ్ నోటీసు జారీ చేసిన తర్వాత కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. సర్టిఫికేషన్ ఇచ్చేందుకు అభ్యంతరం చెప్పడంతో పాటు ఆలస్యం చేయడంతో సినిమా రిలీజ్ షెడ్యూల్ వాయిదా పడింది. దీనిపై హైకోర్టుకు వెళ్లింది సినిమా యూనిట్.
శుక్రవారం (జూన్ 27) వాదనల సందర్భంగా కేరళ హైకోర్టు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సిబిఎఫ్సి)కి కీలక ప్రశ్నలు సంధించింది. రామ్ లఖాన్ ఓకే అయినప్పుడు.. జానకి పేరుపై ఎందుకు అభ్యంతరం చెబుతున్నారని ప్రశ్నించింది. ఇప్పటి వరకు ఏనాడు సెన్సార్ చేయని.. అభ్యంతరం లేని పదాలకు ఇప్పుడు ఎందుకు అభ్యంతరం చెపుతున్నారని హైకోర్టు ప్రశ్నించింది.
సర్టిఫికేషన్ ఇవ్వడానికి ఆలస్యం జరుగుతుండటంపై చిత్ర నిర్మాణ సంస్థ కాస్మోస్ ఎంటర్టైన్మెంట్ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన జస్టిస్ ఎన్ నాగరేష్, వివాదం లేకుండా పౌరాణిక పేర్లను ఉపయోగించే చరిత్ర భారత సినిమాకు ఉందని ఎత్తి చూపారు. కానీ ఇప్పుడు ఎందుకు అభ్యంతరం తెలుపుతున్నారనిప ప్రశ్నించారు.
"మన దేశంలో సీతా ఔర్ గీత అనే సినిమా ఉంది. జానకి అంటే సీత . ఆ సినిమాలో ఆ పేరు వాడినందంకు ఏ సమస్య లేదు. ఎవరికీ అభ్యంతరం లేదు. అలాగే రామ్ లఖన్ అనే సినిమా ఉంది. ఆ సినిమా పేరు విషయంలో కూడా ఎవరికీ ఎలాంటి అభ్యంతరం లేదు. అలాంటప్పుడు ఈ సినిమాలో జానకి అనే పేరుపై అభ్యంతరం ఎలా వచ్చింది?" అని న్యాయమూర్తి ప్రశ్నించారు.
సీతాదేవి పేరుకు మారుపేరైన 'జానకి' అనే పేరును అటువంటి కంటెంట్ ఉన్న సినిమాలో ఉపయోగించడం వల్ల కొన్ని వర్గాల సెంటటిమెంట్ దెబ్బతిటుందని CBFC తరపున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ (DSGI) వాధించారు. లైంగిక హింసపై ఆధారపడిన సినిమాలో ఆ పేరు వాడకంపై సెన్సార్ బోర్డు అభ్యతరం చెప్పిందని తెలిపారు. అందుకే ఈ చిత్రం జూన్ 27న విడుదల కావాల్సి ఉండగా సర్టిఫికేషన్ ఆలస్యం కారణంగా ఆగిపోయిందని చెప్పారు.
అయితే, ఈ అభ్యంతరం వెనుక ఉన్న కారణాన్ని కోర్టు ప్రశ్నించింది. దీంతో CBFC స్క్రీనింగ్ కమిటీ ఇప్పటికే ఈ చిత్రానికి అనుమతి ఇచ్చిందని, కానీ ఛైర్మన్ దానిని రివైజింగ్ కమిటీకి ప్రతిపాదించారని తెలిపారు. ఆ కమిటీ పేరుకు సంబంధించిన అంశాన్ని లేవనెత్తిందని ఈ సందర్భంగా చెప్పారు.
సినిమాటోగ్రాఫ్ (సర్టిఫికేషన్) రూల్స్, 1983 ప్రకారం, రివైజింగ్ కమిటీ షోకాజ్ నోటీసు జారీ చేయలేదని.. ఆ కమిటీ పాత్ర అభ్యంతరకమైన సీన్స్ కట్ చెప్పడం, సర్టిఫికెట్లు జారీ చేయడం వరకే పరిమితమని మూవీ ప్రొడక్షన్ తరఫున న్యాయవాది వాదించారు.
జూన్ 12న ఈ సర్టిఫికేషన్ కోసం అప్లై చేసుకుంటే, 18న సినిమా చూసిన బోర్డు.. ఇంకా ఆలస్యం చేయడం వలన షెడ్యూల్ ప్రకారం రిలీజ్ చేయలేమని.. ఆర్థిక నష్టాలు వస్తాయని కోర్టుకు తెలిపారు.
అయితే జూన్ 30న కోర్టు ముందు షోకాజ్ నోటీసుకు హాజరు కావాలా, పిటిషన్ అప్పీల్ చేసుకోవాలా..? అనేది ప్రొడక్షన్ హౌజ్ నిర్ణయించుకోవాలని ఈ సందర్భంగా న్యాయమూర్తి సూచించారు.