
దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న యూత్‌ఫుల్ సోషల్ డ్రామా ‘యుఫోరియా’. నీలిమ గుణ నిర్మిస్తున్నారు. విఘ్నేష్ గవిరెడ్డి హీరోగా ఎంట్రీ ఇస్తున్న ఈ చిత్రంలో భూమిక, సారా అర్జున్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసి ఫస్ట్ సాంగ్‌ను రిలీజ్ చేసిన టీమ్.. తాజాగా రెండో పాటను విడుదల చేసింది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో గుణ శేఖర్ మాట్లాడుతూ ‘ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయ్యేలా మంచి మెసేజ్‌తో కుటుంబ సమేతంగా చూసేలా ఈ సినిమాను తెరకెక్కించాం. అందరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది.
ఈ చిత్రంలో దాదాపు 20 మంది కొత్త వారిని పరిచయం చేస్తున్నా. చాలా రోజుల తర్వాత భూమిక మా సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వడం సంతోషంగా ఉంది’ అని చెప్పారు. భూమిక మాట్లాడుతూ ‘నా హృదయానికి ఎంతో దగ్గరైన సినిమా ఇది. నాకు పదకొండేళ్ల కొడుకున్నాడు. విఘ్నేష్‌తో సెట్స్‌లో ఉన్నప్పుడు మా అబ్బాయితో ఉన్నట్లే అనిపించింది. తను ఎంతో గొప్పగా నటించాడు. ఈ సినిమా మనపై ఎంతో ఇంపాక్ట్ చూపిస్తుందని నమ్ముతున్నా. తల్లిదండ్రులు తప్పకుండా చూడాల్సిన సినిమా’ అని అన్నారు. ప్రేక్షకుల సమయానికి, డబ్బుకి విలువిచ్చి చేసిన సినిమా ఇదని నటుడు విఘ్నేష్ చెప్పాడు. నిర్మాత నీలిమ గుణ సహా టీమ్ అంతా పాల్గొన్నారు.