Ramba Oorvasi Menaka Review: సోషియో ఫాంటసీ 'రంభ ఊర్వశి మేనక' రివ్యూ.. అల్లరి నరేశ్ నవ్వించాడా? డిజప్పాయింట్ చేశాడా?

Ramba Oorvasi Menaka Review: సోషియో ఫాంటసీ 'రంభ ఊర్వశి మేనక' రివ్యూ.. అల్లరి నరేశ్ నవ్వించాడా? డిజప్పాయింట్ చేశాడా?

టాలీవుడ్ కామెడీ హీరో అంటే గుర్తొచ్చే పేరు అల్లరి నరేష్. గతంలో తనదైన మార్క్ హాస్యంతో వరుస హిట్లతో తనకంటూ ప్రత్యేకమైన జానర్ ను క్రియేట్ చేసుకున్నారు. అయితే ఆతర్వాత సీరియస్ కథనల వైపు టర్న్ తీసుకున్నారు.  కానీ ఆ ప్రయోగం పెద్దగా ఫలితాన్ని ఇవ్వకపోవడంతో మళ్లీ తన పాత కామెడీ జోనర్ నే నమ్ముకున్నారు. లేటెస్ట్ గా ఆయన నటించిన చిత్రం 'రంభ ఊర్వశి మేనక' ఈరోజు ( సెప్టెంబర్ 4, 2026 ) థియేటర్లలోకి ఎంట్రీ ఇచ్చింది. చందమామ కథలను గుర్తుచేసే కాన్సెప్ట్ తో తెరకెక్కించిన ఈ సోషియో ఫాంటసీ మూవీ ప్రేక్షకులను మెప్పించిందా? ఈ అల్లరోడిని మళ్లీ కామెడీ కింగ్ లా నిలబెట్టిందా? అనేది చూద్దాం..

కథేంటంటే..

మంతెన సూర్యనారాయణ అలియాస్ సూరి (అల్లరి నరేశ్) ఏ పనీ పాట లేకుండా కాలం వెళ్లదీసే ఒక సోమరిపోతు. నాటకాలు వేసే తన కుటుంబంలో ఒక పురాతనమైన మ్యాజిక్ బుక్ లభిస్తుంది. అందులోని గీతలను సరిగ్గా పూర్తిచేస్తే స్వర్గం నుంచి రంభ, ఊర్వశి, మేనకలు ధరకు దిగివచ్చి కోరిన కోరికలు తీరుస్తారని సూరి నమ్ముతాడు. ఊరంతా అప్పులు చేస్తూ, పదిహేనేళ్ల పాటు అదే పనిగా ఆ పుస్తకంపై గీతలు గీస్తూ ఉంటాడు. తన చిన్ననాటి ప్రేమ చిన్ని (సురభి)ని దక్కించుకోవడానికి.. ఆమె తండ్రి పెట్టే కండిషన్లను దాటడానికి ఈ దేవకన్యల సహాయం కోరాలనుకుంటాడు.

అయితే ఇంతలో అనూహ్యంగా సూరి తల్లికి ప్రాణాంతకమైన వ్యాధి ఉందని తేలుతుంది. ఒకవైపు హాస్పిటల్ లో తల్లి చావుబతుకుల మధ్య ఉండగా, అదే సమయంలో సరిగ్గా పుస్తకంలోని గీత పూర్తయి రంభ (రాశీ సింగ్), ఊర్వశి (ప్రిషా సింగ్), మేనక (విష్ణు ప్రియ)లు సూరి ముందు ప్రత్యక్షమవుతారు. ఈ ఊహించని పరిణామం సూరి జీవితాన్ని ఎలాంటి మలుపులు తిప్పింది? ఎస్సై అప్పలనాయుడు (తారక్ పొన్నప్ప)తో అతడికి వచ్చిన గొడవ ఏమిటి? చివరికి ఈ అప్సరసలు సూరి జీవితాన్ని మార్చాయా?   స్వర్గాధిపతి ఇంద్రుడు (వెన్నెల కిశోర్), కార్పొరేట్ కంపెనీ సీఈఓ (వికే నరేశ్)ల వల్ల ఎలాంటి రోలర్ కోస్టర్ డ్రామా జరిగింది అనేది మిగతా కథ.
 
ఎవరెలా చేశారంటే?

ఇటువంటి కామెడీ టైమింగ్ ఉన్న పాత్రలు నరేశ్‌కు వెన్నతో పెట్టిన విద్య. తన కామెడీ టైమింగ్‌తో సినిమాను నిలబెట్టడానికి గట్టిగానే ప్రయత్నించాడు.  వయసు మళ్లిన సీఈఓగా వికే నరేశ్, దేవకన్య రంభను లైన్లో పెట్టడానికి చేసే ప్రయత్నాలు, ఆయన చెప్పే డైలాగులు థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయిస్తాయి. రాశీ సింగ్, ప్రిషా సింగ్, విష్ణు ప్రియలు తమ అందచందాలతో తెరపై పండగలా కనిపిస్తారు.

మైనస్ ఇదే..

అయితే, దర్శకుడు చంద్రమోహన్ కాన్సెప్ట్ వరకు బాగానే ఎంచుకున్నా, దాన్ని తెరకెక్కించడంలో తడబడ్డాడు. ముఖ్యంగా ఒకవైపు తీవ్రమైన తల్లి సెంటిమెంట్, మరోవైపు లాజిక్ లేని బ్రైట్ కామెడీ నడుస్తుంటే ప్రేక్షకుడు ఏ భావోద్వేగానికి కనెక్ట్ అవ్వాలో అర్థం కాక గందరగోళానికి గురవుతాడు. సెకండ్ హాఫ్‌లో వస్తున్న అవుట్ డేటెడ్ స్ఫూఫ్‌లు, ప్లాట్ పరంగా తీవ్రంగా సాగదీసిన సన్నివేశాలు విసుగు తెప్పిస్తాయి. కన్నడ నటుడు తారక్ పొన్నప్ప, కథానాయిక సురభి పాత్రలకు అసలు ప్రాధాన్యతే లేకపోవడం నిరాశపరుస్తుంది.

సాంకేతికంగా ఏ చైతన్ భరద్వాజ్ సంగీతం పాటల పరంగా సగటుగా ఉన్నా..  బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో పర్వాలేదనిపించాడు. రామ్ రెడ్డి కెమెరా వర్క్ సినిమాకు డివైన్ లుక్ తీసుకురావడంలో తోడ్పడింది. ఎడిటింగ్ ఇంకాస్త పదునుగా ఉంటే బాగుండేదన్న టాక్ వినిపిస్తోంది.. సత్వర మార్గాల్లో అద్భుతాలు జరిగిపోవాలని భావించే నేటి సోమరి యువతకు ముగింపులో ఇచ్చిన సందేశం బాగున్నప్పటికీ, పాతకాలపు కథనం వల్ల సినిమా బోరింగ్‌గా మారుతుంది.

అయితే కేవలం కొన్ని నవ్వుల కోసం, నరేశ్ కామెడీ టైమింగ్ కోసం లాజిక్స్ పక్కనబెట్టి చూడొచ్చు. కానీ ఒక పూర్తిస్థాయి అవుట్ అండ్ అవుట్ ఫన్ రైడ్ ఆశిస్తే మాత్రం ఈ 'రంభ ఊర్వశి మేనక'  నిరాశపరచవచ్చు అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.