టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన ‘రణబాలి’ బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే ఓపెనింగ్స్‌తో సత్తా చాటింది. అక్టోబర్ 16న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.16.50 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అయితే, విజయ్ గత సినిమాలైనా ‘లైగర్’, ‘ఖుషి’, ‘కింగ్డమ్’ సినిమాలతో పోలిస్తే ‘రణబాలి’ ఓపెనింగ్ తక్కువగా నమోదైంది.
ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే..!
ట్రేడ్ వెబ్ సైట్ Sacnilk వెల్లడించిన వివరాల ప్రకారం.. ‘రణబాలి’ ఇండియాలో మొదటి రోజు రూ.9.25 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టింది. దేశవ్యాప్తంగా 2,515 షోల ద్వారా రూ.10.75 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇక ఓవర్సీస్ మార్కెట్లో రూ.5.75 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు సమాచారం. దీంతో వరల్డ్‌వైడ్‌గా ‘రణబాలి’ తొలి రోజు మొత్తం రూ.16.50 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్లు తెలిపింది.
ఆక్యుపెన్సీలోనూ అదరగొట్టిన రణబాలి..
బాక్సాఫీస్ వసూళ్లతో పాటు థియేటర్లలో ఆక్యుపెన్సీ విషయంలోనూ ‘రణబాలి’ మంచి ప్రదర్శన కనబరిచింది. సినిమాకు తొలి రోజు ఓవరాల్ ఆక్యుపెన్సీ 57 శాతంగా నమోదైంది. ముఖ్యంగా తెలుగు 2డీ వెర్షన్‌కు నైట్ షోలలో 67.92 శాతం ఆక్యుపెన్సీ రావడం విశేషం. మార్నింగ్ షోలతో పోలిస్తే రాత్రి షోలకు ప్రేక్షకుల స్పందన మెరుగ్గా కనిపించింది. ఈ ట్రెండ్ వీకెండ్ కలెక్షన్లపై ఆసక్తిని పెంచుతోంది.
వీకెండ్లో కలెక్షన్లు పెరుగుతాయా?
మొదటి రోజు వచ్చిన రూ.16.50 కోట్ల వరల్డ్‌వైడ్ గ్రాస్‌తో ‘రణబాలి’ మంచి ఆరంభాన్ని అందుకుంది. ఇప్పుడు శని, ఆదివారాల్లో ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుంది? ఆక్యుపెన్సీ మరింత పెరిగి వసూళ్లు ఊపందుకుంటాయా? అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే, సినిమా అసలు బాక్సాఫీస్ స్టామినాను అంచనా వేయాలంటే వీకెండ్ కలెక్షన్లతో పాటు ముందున్న రోజుల్లోనూ వసూళ్ల నిలకడను కూడా పరిశీలించాల్సి ఉంటుంది.
విజయ్ దేవరకొండ గత సినిమాల ఫస్ట్ డే కలెక్షన్లు:
‘లైగర్’, ‘ఖుషి’, ‘కింగ్డమ్’ సినిమాలతో పోలిస్తే ‘రణబాలి’ ఓపెనింగ్ తక్కువగా నమోదైంది. అయితే ‘ది ఫ్యామిలీ స్టార్’ తొలి రోజు వసూళ్లను మాత్రం అధిగమించింది. విజయ్ దేవరకొండ కెరీర్లో అత్యధిక ఓపెనింగ్ సాధించిన చిత్రాల జాబితాలో ‘లైగర్’, ‘కింగ్డమ్’ ముందుండగా, ‘రణబాలి’ రానున్న రోజుల్లో వసూళ్లను ఎంతవరకు పెంచుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.
సినిమా ఇండియా నెట్ (డే 1) వరల్డ్‌వైడ్ గ్రాస్ (డే 1)
‘లైగర్’ రూ.15.95 కోట్లు సుమారు రూ.33 కోట్లు
‘ఖుషి’ రూ.15.25 కోట్లు రూ.25.68 కోట్లు
‘ది ఫ్యామిలీ స్టార్’ రూ.5.75 కోట్లు రూ.12.01 కోట్లు
‘కింగ్డమ్’ రూ.15–18 కోట్లు రూ.34.12 కోట్లు
‘రణబాలి’ రూ.9.25 కోట్లు రూ.16.50 కోట్లు
స్వాతంత్ర్య పోరాట నేపథ్యంలో ‘రణబాలి’
దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కించిన ‘రణబాలి’ 1876–78 నాటి మహా మద్రాస్ కరువు నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని రూపొందిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా. బ్రిటిష్ వలస పాలనలో ప్రజలు ఎదుర్కొన్న కష్టాలు, అణచివేతకు వ్యతిరేకంగా సాగిన పోరాటాన్ని ఈ చిత్రం ఆవిష్కరిస్తుంది. విజయ్ దేవరకొండ రణబాలి పాత్రలో కనిపించగా.. రష్మిక మందన్న జయమ్మగా నటించింది. అజయ్–అతుల్ సంగీతం అందించిన ఈ సినిమాకు భారీ స్థాయి ప్రొడక్షన్ డిజైన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
