Ranabaali Review: విజయ్ దేవరకొండ ఫ్యాన్స్కు పండగేనా? ఆడియన్స్ రివ్యూలు ఎలా ఉన్నాయంటే?

Ranabaali Review: విజయ్ దేవరకొండ ఫ్యాన్స్కు పండగేనా? ఆడియన్స్ రివ్యూలు ఎలా ఉన్నాయంటే?

టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ (RANABAALI). ఇవాళ శుక్రవారం (అక్టోబర్ 16, 2026న) మూవీ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ‘టాక్సీవాలా’, ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ ఈ సినిమాను తెరకెక్కించగా, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు.

1876–78 మధ్య దక్షిణ భారతదేశాన్ని కుదిపేసిన మహా కరువు, బ్రిటిష్ పాలనలో ప్రజలు ఎదుర్కొన్న దోపిడీ, అణచివేత నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. విజయ్ దేవరకొండ వీరుడిగా కనిపించడం, రష్మిక మందన్న జయమ్మ పాత్రలో నటించడం, బ్రిటిష్ పాలకులపై తిరుగుబాటు వంటి అంశాలతో సినిమా విడుదలకు ముందు నుంచే ఆసక్తి పెంచింది. మరి సినిమా చూసిన ప్రేక్షకులు ఏమంటున్నారు? విజయ్ నటన, రష్మికతో కెమిస్ట్రీ, కథనం, యాక్షన్ సన్నివేశాలు ఎలా ఉన్నాయి? సోషల్ మీడియాలో వస్తున్న ఆడియన్స్ ఫస్ట్ టాక్ ఏంటనేది తెలుసుకుందాం..

‘రణబాలి’ కథ:

చరిత్రలో కొన్ని ఘటనలు కాలగర్భంలో కలిసిపోతాయి. కానీ కొన్ని విషాదాలు మాత్రం తరాలు మారినా వాటి ఆనవాళ్లను మిగుల్చుతూనే ఉంటాయి. అలాంటి భయానక అధ్యాయమే 1876-78 మధ్య దక్షిణ భారతాన్ని అతలాకుతలం చేసిన మద్రాస్‌ మహా కరవు. ఆకలి, పేదరికం, అంటు వ్యాధులతో ఆ కాలంలో ఎన్నో కుటుంబాలు దుర్భర పరిస్థితులను ఎదుర్కొన్నాయి. అదే చీకటి చరిత్రను కథా నేపథ్యంగా ఎంచుకుని తెరకెక్కిన చిత్రమే ‘రణబాలి’ (Ranabaali).

సింగనమల బొబ్బిలి రణబాలి టైటిల్ పాత్రలో విజయ్ దేవరకొండ నటించారు. బ్రిటిష్ పాలనలో కరువు, ఆకలి, దోపిడీతో అల్లాడుతున్న ప్రజల కోసం పోరాడే ఓ వీరుడిగా కనిపించారు. బ్రిటిష్ అధికారులతో ఆయన చేసే పోరాటాలు, భారీ యాక్షన్ సన్నివేశాలు సినిమాలో హైలైట్‌గా నిలిచాయి. మరోవైపు రష్మిక మందన్న జయమ్మ పాత్రలో సినిమాకు భారీ ఇంపాక్ట్ తీసుకొచ్చింది. ఆమె రణబాలి భార్యగా, అతడి పోరాటంలో భాగస్వామిగా కనిపించింది. హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ సర్ థియోడర్ హెక్టర్ అనే బ్రిటిష్ అధికారి పాత్రలో విలన్గా కనిపించారు.

80 లక్షల మంది ప్రాణాలు కోల్పోయిన ఓ మహా విపత్తు.. 

ఈ మహాకరువులో 80 లక్షల మంది ప్రాణాలు కోల్పోయిన ఓ మహా విపత్తు వెనుక.. లెక్కల్లో కనిపించని వేలాది కుటుంబాల కన్నీటి కథలున్నాయి. అందుకే ‘రణబాలి’ని కేవలం ఓ పీరియాడిక్‌ యాక్షన్‌ సినిమాగా చూడలేం. ఓ విపత్తు మనిషి జీవితాన్ని ఎంతలా మార్చగలదు? అణచివేతను ఎదుర్కొంటున్న ప్రజల్లో తిరుగుబాటు ఆలోచన ఎలా పుడుతుంది? తమ నేల, తమ మనుషుల కోసం కొందరు ఎందుకు పోరాట బాట పడాల్సి వచ్చింది? వంటి ఎన్నో ప్రశ్నలకు కథ రూపంలో సమాధానం చెప్పే ప్రయత్నమే ఈ సినిమా.

విజయ్ నటనకు ప్రశంసలు..

‘రణబాలి’ సినిమాలో విజయ్ దేవరకొండ నటన సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచిందనే టాక్ వినిపిస్తోంది. రణబాలి పాత్రలో ఆయన చూపించిన ఆవేశం, యాక్షన్ సన్నివేశాలు, పవర్‌ఫుల్ డైలాగులు అభిమానులను ఆకట్టుకుంటున్నాయని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా బ్రిటిష్ పాలకులకు ఎదురొడ్డి నిలబడే సన్నివేశాల్లో విజయ్ నటన బాగుందని ప్రశంసిస్తున్నారు. రష్మిక మందన్నతో ఆయన కెమిస్ట్రీ కూడా సినిమాకు ప్లస్‌గా నిలిచిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, విజయ్ తన నటనతో ఆకట్టుకున్నప్పటికీ, కథనం మరింత బలంగా ఉండాల్సిందని కొందరు ప్రేక్షకులు అంటున్నారు.

ఫస్టాఫ్, సెకండాఫ్ టాక్..

విజయ్ దేవరకొండ ఎంట్రీ, రష్మికతో వచ్చే సన్నివేశాలు, బ్రిటిష్ పాలకుల దౌర్జన్యాలను చూపించిన కొన్ని ఘట్టాలు ఆకట్టుకున్నాయని కొందరు నెటిజన్లు ట్వీట్లు పెడుతున్నారు. ఇంటర్వెల్‌కు ముందు వచ్చే ఎపిసోడ్ సినిమాకు హై ఇచ్చిందని అంటున్నారు. అయితే, సినిమా స్టార్టింగ్లో స్టోరీ కొంచెం స్లోగా సాగడం, కొన్ని సన్నివేశాల్లో ఎమోషన్స్ బలంగా పండకపోవడం నిరాశ కలిగించాయని మరికొందరు అభిప్రాయపడ్డారు.

ముఖ్యంగా సెకండాఫ్‌లోని సాగదీత, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు మెయిన్ మైనస్‌లుగా మారాయని ఓవర్సీస్ ఆడియన్స్ ట్వీట్స్ పెడుతున్నారు. ఏదేమైనా, ఇది ఫస్ట్ షో కాబట్టి మిక్సెడ్ టాక్ వినిపిస్తూనే ఉంటుంది. ఇవాళ సాయంత్రం వరకు రెండు, మూడు షోలు పడ్డాకే అసలు సినిమా ఏంటనేది ఓ క్లారిటీ వస్తుంది.