చరిత్రలో మరుగునపడిన వీరుల కథ ‘రణబాలి’ అని విజయ్ దేవరకొండ అన్నాడు. తను హీరోగా రష్మిక హీరోయిన్‌గా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం దసరా సందర్భంగా అక్టోబర్ 16న విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమా నేపథ్యం, కథలోని ఎమోషన్స్, తన పాత్ర కోసం చేసిన కృషి వంటి ఆసక్తికర విషయాలను విజయ్ దేవరకొండ ఇలా షేర్ చేసుకున్నాడు.
‘పెళ్లి చూపులు’ తర్వాత ఎంతో నమ్మకంతో ప్రమోషన్స్ చేస్తున్న సినిమా ‘రణబాలి’. ఈ చిత్రం ద్వారా భారతీయ చరిత్రలో మరుగునపడిన అనేక వాస్తవాలను ప్రేక్షకులకు పరిచయం చేయాలనుకుంటున్నాం. బ్రిటిష్ పాలనలో ప్రజలు ఎదుర్కొన్న ఆకలి, పన్నుల భారం, దోపిడీ వంటి పరిస్థితులను ఇందులో చూపించబోతున్నాం. బ్రిటిషర్లు మన దేశంలోని రైల్వే వ్యవస్థను ప్రజల సౌకర్యం కోసం నిర్మించలేదు. దేశ సంపదను తరలించేందుకు ఉపయోగించుకున్నారు. అప్పటి కరువులు, ప్రజల కష్టాలు, పాలకుల దోపిడీ గురించి నేటి తరానికి తెలియాల్సిన అవసరం ఉంది.
డైరెక్టర్ రాహుల్ అనంతపూర్‌లో జరిగే ఒక జాతరలో చేసిన జానపద వీడియో పంపాడు. అందులో ఎంతోమంది చారిత్రక వీరుల గురించి గొప్పగా చెప్పారు. మా సినిమా కూడా అలాంటి జానపదంతోనే ప్రారంభమవుతుంది. అప్పట్లో మన ఊర్లలో ఉండే వాతావరణం, మన కల్చర్, మన వీరుల గొప్పదనం, చరిత్రలో జరిగింది ఏంటి అనేవి చెబుతూ మాస్, రియలిస్టిక్ విధానంలో రూపొందించారు. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా యాక్షన్ సన్నివేశాలను డిజైన్ చేశాం. సినిమాలో హింసను కేవలం ప్రేక్షకులను ఆకట్టుకోవడం కోసం ఉపయోగించలేదు. కథకు ప్రాధాన్యమిస్తూ, ప్రేక్షకులను ఆ ప్రపంచంలోకి తీసుకెళ్లేలా రూపొందించాం.
రణబాలి పాత్ర కోసం రాయలసీమ యాసపై రెండు నుంచి మూడు నెలల పాటు ట్రైనింగ్ తీసుకున్నా. గుర్రపు స్వారీ కూడా నేర్చుకున్నా. నా పాత్ర ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి అనే అంశాలపై రాహుల్ చాలా రీసెర్చ్ చేశాడు. కొన్ని హీరో క్యారెక్టర్స్ చాలా తక్కువ మాట్లాడుతూ ఉంటాయి. కానీ రణబాలి అలా కాదు. అప్పట్లో వీరులు ఎలా మాట్లాడేవారో అంత గట్టిగా మాట్లాడుతుంటాడు. నేను ఏ సినిమాలో నటించినా ఇది నా నిజ జీవిత పాత్ర అనుకునే నటిస్తాను. నేను చేసే ప్రతి సినిమా వ్యక్తిగతంగా నాపై ప్రభావం చూపిస్తుంటుంది, నన్ను మారుస్తుంటుంది. రణబాలి ప్రభావం కూడా నాపై వ్యక్తిగతంగా ఉంది.
జయమ్మగా రష్మిక పేరును డైరెక్టర్ రాహుల్ సూచించాడు. నాకు కూడా ఆమె అయితేనే బాగుంటుంది అనిపించింది. గతంలోనూ నా సినిమాల్లో హీరోయిన్ గా రష్మిక ప్రస్తావన వచ్చినా ఆ సినిమాలకు తను కరెక్ట్ కాదు అనిపించింది. మేము కలిసి చేసే సినిమా స్పెషల్‌గా ఉండాలని అనుకున్నా. ఇందులో మా ఇద్దరి మధ్య అలాంటి మంచి డ్రామా ఎమోషన్ ఉంది. మేము కలిసి చేయడం వల్ల ఈ పాత్రలకు ఇంకాస్త ఎమోషనల్ డెప్త్ వచ్చింది. ఎందుకంటే ఆ పాత్రలపై మా రియల్ లైఫ్ ఇంపాక్ట్ కూడా పడుతుంది. సినిమా చూస్తున్నప్పుడు అందరూ అదే ఫీల్ అవుతారు.
రాహుల్ సంకృత్యన్ నాతో రాయలసీమ యాసలో సినిమా చేస్తే, రవి కిరణ్ కోలా గోదారి జిల్లా నేపథ్యంతో సినిమా చేస్తున్నాడు. వాళ్ల యాసలో నన్ను హీరోయిక్‌గా చూపించడానికి ఆ దర్శకులు ఇష్టపడుతున్నారు. డివోషనల్‌గా ఏదైనా బయోపిక్ చేసే అవకాశం వస్తే తప్పకుండా నటిస్తా.
రాజమౌళితో సినిమా చేస్తే తప్ప..
నా కాలేజ్ రోజుల్లో టికెట్ హైక్ వల్ల కొన్ని సినిమాలు చూడలేక బాధపడ్డాను. ఒక హీరోగా నా సినిమాలకు టికెట్ రేట్స్ పెంచడం నాకు ఇష్టం ఉండదు. రణబాలి నుంచి నా రాబోయే ఏ సినిమాకూ టికెట్ హైక్స్ ఉండవు. రాజమౌళి గారితో సినిమా చేస్తే తప్ప నా సినిమాలకు టికెట్ రేట్లు పెంచను.
