భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లో ఒకటిగా తెరకెక్కుతున్న చిత్రం 'రామాయణ' . నవంబర్ 5, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతున్న ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైన కొద్ది గంటల్లోనే సాధించిన కోట్ల రూపాయల వసూళ్లు ఇప్పుడు ట్రేడ్ వర్గాలను సైతనం ఆశ్చర్యపరుస్తోంది. ఈ మైథలాజికల్ ఎపిక్ లో బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా నటిస్తున్నారు.
భారీ బడ్జెట్ అంచనాలతో వస్తున్న 'రామాయణ' మూవీ.. భారత్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రూ.4.88 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టిందని ట్రేడ్ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి. దాదాపు 85 వేల టికెట్లు అమ్ముడయ్యాయి. బ్లాక్ బుకింగ్స్‌ను మినహాయిస్తే వసూళ్లు రూ.3.05 కోట్లుగా నమోదయ్యాయి. బుధవారం ఉదయం 8 గంటల నాటికి 104 నగరాల్లో బుకింగ్స్ నమోదవడం ఈ సినిమాపై ఉన్న క్రేజ్‌కు నిదర్శనం. అయితే ఇవి తొలి దశ గణాంకాలే కావడంతో విడుదల సమయానికి ఈ సంఖ్యలు మరింత పెరిగే అవకాశం ఉంది.
నగరాల వారీగా చూస్తే ఢిల్లీ-ఎన్‌సీఆర్ రూ.1.42 కోట్ల వసూళ్లతో అగ్రస్థానంలో నిలిచింది. ముంబై రూ.1.01 కోట్లతో రెండో స్థానంలో ఉంది. పుణె, కోల్‌కతా, బెంగళూరు నగరాల్లోనూ ప్రేక్షకులు టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. భాషల పరంగా హిందీ వెర్షన్ రూ.4.62 కోట్లతో ముందంజలో ఉండగా.. కన్నడ వెర్షన్ రూ.24.92 లక్షలు వసూలు చేసింది. తెలుగు వెర్షన్ వసూళ్లు రూ.47,400గా నమోదయ్యాయి.
ఇక ముంబైలోని లోయర్ పరేల్ ప్రాంతంలో ఉన్న పీవీఆర్ ఐకాన్ ఫీనిక్స్ పల్లాడియంలో కొన్ని ఐమ్యాక్స్ 3డీ షోలకు రిక్లైనర్ సీటు ధర ఏకంగా రూ.2,770గా ఉంది. నవంబర్ 5న ఉదయం 6.45 గంటల షోతో పాటు రాత్రి 11.45 గంటల షో కూడా అందుబాటులో ఉన్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైన కొద్ది గంటల్లోనే ఊహించని స్థాయిలో వసూళ్లు రాబట్టడం ఈ మూవీపై ఉన్న అంచనాలను రెట్టింపు చేస్తోంది.
మరోవైపు, యష్ రావణుడిగా కనిపించిన 'రైజ్ ఆఫ్ అసుర' వీడియో కూడా సినిమాపై హైప్‌ను పెంచుతోంది. నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రెండు భాగాల చిత్రంలో సన్నీ డియోల్, రవీ దూబే, అరుణ్ గోవిల్, లారా దత్తా, అనుపమ్ ఖేర్, రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రైమ్ ఫోకస్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని నవంబర్ 5, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. అయితే అసలు పరీక్ష మాత్రం తొలి రోజు వసూళ్లు, ప్రేక్షకుల స్పందనతోనే మొదలుకానుంది..
