హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి చెందిన టీజీ-ఐపాస్ (TG-iPASS) పోర్టల్‌పై ర్యాన్సమ్వేర్ దాడి జరిగింది. పోర్టల్ సర్వర్‌లో ‘డేటాలీక్స్5’ (DataLeaks5) అనే మెయిల్ ఐడీతో ర్యాన్సమ్ నోట్ కనిపించడంతో ఈ సైబర్ దాడి వెలుగులోకి వచ్చింది. పోర్టల్‌కు సంబంధించిన డేటాబేస్‌తో పాటు కొన్ని ఫైళ్లు ఎన్‌క్రిప్ట్ అయినట్లు గుర్తించిన అధికారులు అప్రమత్తమయ్యారు.
సర్వర్‌పై అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించిన పరిశ్రమల శాఖ డైరెక్టర్ సురేష్ ఈ ఘటనపై సైబర్ సెక్యూరిటీ బ్యూరో (CSB)కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.పోర్టల్ డేటాబేస్, ఎన్‌క్రిప్ట్ చేసిన ఫైళ్లకు సంబంధించి సర్వర్‌లో ర్యాన్సమ్ నోట్ కనిపించడంతో కీలక సమాచారం భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఎంతమేర డేటా ప్రభావితమైంది? ఏదైనా సమాచారం బయటకు వెళ్లిందా? సర్వర్‌ను తిరిగి సాధారణ స్థితికి తీసుకొచ్చారా? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.
ఈ దాడి వెనుక ఎవరున్నారు? దాడి ఎలా జరిగింది? డేటా చోరీ జరిగిందా? అనే కోణాల్లో సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. విచారణ పూర్తయిన తర్వాతే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
