సత్యదేవ్ హీరోగా దర్శకుడు వెంకటేశ్ మహా రూపొందించిన చిత్రం ‘రావు బహదూర్’. మహేష్‌బాబుకు సంబంధించిన జిఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో చింతా గోపాలకృష్ణా రెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర కలిసి నిర్మించారు. జులై 3న పాన్ ఇండియా వైడ్‌గా సినిమా విడుదల కానుంది. తాజాగా ‘మోర్ దాన్ ఏ టీజర్’ పేరుతో ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు.
ఈ వీడియోకు మహేష్ బాబు అందించిన వాయిస్ ఓవర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భావోద్వేగాలతో కూడిన నేరేషన్, రావు బహదూర్ కేవలం ఒక సినిమా కాదు... సరికొత్త సినీ అనుభూతి అనే విషయాన్ని తెలియజేస్తోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో సత్యదేవ్ మాట్లాడుతూ ‘తెలుగు సినిమాకు మేము రాస్తున్న ప్రేమలేఖే 'రావు బహదూర్' సినిమా. మహేష్ బాబు గారు కూడా ఈ సినిమా చూసి ‘ఇది తెలుగు సినిమాకు ఒక లవ్ లెటర్’ అని అన్నారు. -
ఈ సినిమాతో నాకు 'రావు బహదూర్ సత్యదేవ్' అనే ట్యాగ్ వస్తుందనే నమ్మకం ఉంది’ అని అన్నాడు. ఈ సినిమాతో తన కల నెరవేరిందని దీప థామస్ చెప్పింది. తెలుగు సినిమా కిరీటంలో ఇది మరో కలికితురాయిగా నిలుస్తుందని, చాలా కాలంపాటు గుర్తుండిపోతుందని దర్శకుడు వెంకటేశ్ మహా అన్నాడు. ఈ సినిమా చూసిన కొద్దీ మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుందని, తెలుగులో ఇప్పటివరకు ఇలాంటి సినిమాలో రాలేదని నిర్మాతలు గోపాలకృష్ణా రెడ్డి, శరత్ చంద్ర, అనురాగ్ అన్నారు.
