ఒమన్‌లోని మస్కట్ నగరానికి సమీపంలో ఉన్న ఖాంతబ్ బీచ్‌కు వెళ్లిన పర్యాటకులకు ఓ అరుదైన దృశ్యం ఎదురైంది. సముద్రపు నీటిలో గులాబీ రంగులో మెరుస్తున్న అరుదైన పింక్ డాల్ఫిన్‌లు ఒడ్డుకు అతి సమీపంలో ఈదుతూ అందరినీ ఆశ్చర్యపరిచాయి. నీలిరంగు గల్ఫ్ ఆఫ్ ఒమన్ సముద్రపు అలల మధ్య ఈ పింక్ డాల్ఫిన్‌లు పైకి లేస్తూ సాగిన తీరు చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ అరుదైన సముద్ర జీవుల వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఖాంతబ్ బీచ్.. అందమైన తీర ప్రాంతానికి, రాతి ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి చెందింది. అయితే ఊహించని విధంగా అక్కడ ప్రత్యక్షమైన ఈ గులాబీ రంగు డాల్ఫిన్‌లు ఆ ప్రాంతాన్ని ఫేమస్ చేస్తున్నాయి. అక్కడికి వచ్చిన సందర్శకులు ఈ దృశ్యాలను తమ ఫోన్లతో వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. సహజ సిద్ధమైన ఆవాసంలో ఈ రకమైన విశిష్టమైన జంతువులను ప్రత్యక్షంగా చూసే అవకాశం రావడంతో పర్యాటకులు సంతోషం వ్యక్తం చేశారు.
FIRST KHALI IN PINK, NOW A PINK DOLPHIN 😭 Yesterday, Khali wore pink and amazed the world. Today, a RARE PINK DOLPHIN was spotted off Qantab Beach, Oman! https://t.co/fZf0dCeArM
— Nikhil saini (@iNikhilsaini) October 21, 2026
అయితే మస్కట్ తీరంలో కనిపించిన ఈ డాల్ఫిన్‌ల కచ్చితమైన జాతి ఏమిటనే దానిపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత రాలేదు. కేవలం వాటి అసాధారణ రంగును బట్టి మాత్రమే వాటిని గుర్తించడం సాధ్యం కాదని నిపుణులు పేర్కొంటున్నారు. సాధారణంగా డాల్ఫిన్‌లలో గులాబీ రంగు కనిపించడానికి వివిధ కారణాలు ఉండవచ్చు. అమెరికాలోని మంచినీటి నదులలో నివసించే 'అమెజాన్ రివర్ డాల్ఫిన్'లు వయస్సు పెరిగే కొద్ది, రక్త ప్రసరణ, శారీరక శ్రమ లేదా గాయాల కారణంగా గులాబీ రంగులోకి మారుతుంటాయట.
అయినప్పటికీ అన్ని గులాబీ రంగు డాల్ఫిన్‌లు అవే జాతికి చెందినవి కావాలని నిబంధన లేదు. కొన్నిసార్లు సూర్యరశ్మి, కెమెరా లైటింగ్ పరిస్థితుల కారణంగా కూడా వాటి రంగు అలా కనిపించవచ్చు. సముద్ర జీవుల వైవిధ్యానికి నిలయమైన గల్ఫ్ ఆఫ్ ఒమన్ తీరంలో డాల్ఫిన్‌లు కనిపించడం సాధారణమే అయినప్పటికీ.. ఇలా స్పష్టమైన గులాబీ రంగులో కనిపించడం మాత్రం అత్యంత అరుదు.
