వెండితెరపై తన నటనతో కోట్లాది మంది హృదయాలను కొల్లగొట్టిన నేషనల్ క్రష్ రష్మిక మందన్న.. నిజ జీవితంలోనూ తన ఉదారతతో అందరి మనసులనూ గెలుచుకుంటున్నారు. ఆపదలో ఉన్న పేద ప్రజలకు అండగా నిలిచేందుకు ఆమె 'ప్రాజెక్ట్ అన్నపూర్ణ' అనే అద్భుతమైన సామాజిక సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ.. తన సేవా కార్యక్రమం వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని వివరించారు.
'ప్రాజెక్ట్ అన్నపూర్ణ' కింద దత్తత
ఈ బృహత్తర యజ్ఞంలో భాగంగా దక్షిణ భారతదేశంలోని 8 కీలక ప్రాంతాలైన హైదరాబాద్, మహబూబ్నగర్, అనంతపురం, విజయవాడ, బెంగళూరు, చెన్నై, కొచ్చి, కొడగులలోని మొత్తం 400 పేద కుటుంబాలను ఆమె దత్తత తీసుకున్నట్లు రష్మిక తెలిపారు. వచ్చే ఏడాది పాటు ప్రతి 3 నెలలకు ఒక దఫా చొప్పున ఈ కుటుంబాలకు అవసరమైన సమగ్ర నిత్యావసర ఆహార సరుకుల కిట్లను ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పారు.
ఈ ఆహార కిట్లో 75 కిలోల బియ్యం, 10 కిలోల గోధుమ పిండి, 15 కిలోల పప్పులు, 10 లీటర్ల వంట నూనెతో పాటు రాగులు, మసాలా దినుసులు, టీ పొడి వంటి సమగ్ర దినుసులు ఉంటాయి. దీనివల్ల ఆయా కుటుంబాలు నిత్యావసరాల ఖర్చును ఆదా చేసుకుని తమ పిల్లల భవిష్యత్తు కోసం పొదుపు చేయగలుగుతారని రష్మిక ఆకాంక్షించారు..
'జయమ్మ' పాత్ర ప్రేరణతో...
తన లేటెస్ట్ చిత్రం 'రణబాలి'లో తాను పోషించిన 'జయమ్మ' పాత్ర ప్రేరణతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రష్మిక ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. 'జయమ్మకు, నాకు ఉన్న పోలికల్లో ఇది ఒకటి. సినిమాల కోసం నేను పడిన గాయాలు, నిద్రలేని రాత్రుల కష్టానికి ప్రేక్షకులు ఇచ్చే ప్రేమే నాకు నిజమైన బహుమానం. నా ఈ ప్రయత్నం ఇతరులకు కూడా స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాను అని 'రష్మిక దేవరకొండ' పేరుతో ఆమె రాసుకొచ్చారు.
విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన పీరియాడికల్ డ్రామా 'రణబాలి'అక్టోబర్ 16న పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతుంది. ఈ నేపథ్యంలో రష్మిక చేసిన ఈ రియల్ లైఫ్ సేవా కార్యక్రమం అభిమానుల హృదయాలను గెలుచుకుంటూ నెట్టింట వైరల్గా మారింది. రష్మిక సేవా కార్యక్రమంపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
