Rashmika Mandanna: రష్మిక మందన్నకు తీవ్ర గాయం.. అభిమానుల్లో ఆందోళన!

Rashmika Mandanna: రష్మిక మందన్నకు తీవ్ర గాయం.. అభిమానుల్లో ఆందోళన!

పాన్ ఇండియా స్టార్ హీరోయిన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న తీవ్రంగా గాయపడింది.  వరుస సినిమాల షూటింగ్‌లతో బిజీగా ఉన్న  ఈ బ్యూటీ.. ఇటీవల ఓ హై-ఎనర్జీ డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా ప్రమాదానికి గురైనట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె 'రణబాలి', 'మైసా' చిత్రాల షూటింగ్‌లలో పాల్గొంటుండగా, యాక్షన్ సన్నివేశాలు, కఠినమైన డ్యాన్స్ మూమెంట్స్ కారణంగా ఆమె హిప్ ప్రాంతంలో టెండన్ పూర్తిగా డిటాచ్ అయినట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ సినిమా డ్యాన్స్ సీక్వెన్స్ షూటింగ్ సందర్భంగా ఈ ప్రమాదం జరిగి తీవ్రంమైన గాయానికి గురైనట్లు సమాచారం.

 ఇలాంటి గాయాలు సాధారణంగా అత్యంత కఠినమైన శారీరక సాధన చేసే ప్రొఫెషనల్ క్రీడాకారుల్లోనే ఎక్కువగా కనిపిస్తాయని వైద్యుల పేర్కొన్నట్లు సమాచారం.. రష్మిక కనీసం ఆరు వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని, అనంతరం ప్రత్యేక రీహాబిలిటేషన్ చికిత్స తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. ఈ గాయం పూర్తిగా నయమవ్వడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం రష్మిక మందన్న చేతిలో పలు భారీ పాన్ ఇండియా చిత్రాలు ఉన్నాయి. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో పాటు, దేశవ్యాప్తంగా ప్రముఖ బ్రాండ్లకు ఆమె బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్నారు. ఈ అనూహ్య గాయం కారణంగా సినిమాల షూటింగ్ షెడ్యూళ్లు, ప్రకటనల చిత్రీకరణలు తాత్కాలికంగా వాయిదా పడే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

ఇటీవల వరుస విజయాలతో దేశవ్యాప్తంగా భారీ అభిమాన వర్గాన్ని సంపాదించుకున్న రష్మిక, ప్రతి కొత్త ప్రాజెక్ట్‌తో తన క్రేజ్‌ను మరింత పెంచుకుంటున్నారు. ఆమె నటిస్తున్న చిత్రాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇలాంటి సమయంలో గాయపడటం అభిమానులను ఆందోళనకు గురి చేసింది. అయితే సరైన చికిత్స, విశ్రాంతి తర్వాత రష్మిక త్వరగా కోలుకుని మళ్లీ షూటింగ్‌లలో పాల్గొనాలని అభిమానులు, సినీ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు.