హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ ముఠాలు రూటు మార్చాయి. కేవలం మత్తు పదార్థాల రవాణాకే పరిమితం కాకుండా.. ఏకంగా ప్రాణాంతక మారణాయుధాలను వెంటబెట్టుకొని తిరుగుతుండటం ఎక్సైజ్ శాఖలో తీవ్ర కలకలం రేపుతున్నది. ఇటీవల రాజేంద్రనగర్, భద్రాచలం–పాల్వంచ పరిధిలో పట్టుబడిన భారీ ఎత్తున పిస్తోళ్లు, రివాల్వర్లు, బుల్లెట్లే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
తనిఖీలకు వెళ్లే ఎక్సైజ్ సిబ్బందికి కేవలం ఖాకీ డ్రెస్సు తప్ప చేతిలో కనీస ఆత్మరక్షణ ఆయుధాలు లేకపోవడంతో క్షేత్రస్థాయిలో ప్రాణభయం వెంటాడుతున్నది. గంజాయి డాన్లు, అంతర్రాష్ట్ర స్మగ్లర్లు తమ అక్రమ దందాను కాపాడుకునేందుకు ఎదురుదాడికి కూడా వెనుకాడబోమనే సంకేతాలు ఇస్తుండటంతో అధికారులు విస్తుపోతున్నారు.
ఈ ఏడాది ఆగస్టు 20న భద్రాచలం–పాల్వంచ కేంద్రంగా వెలుగుచూసిన అంతర్రాష్ట్ర నెట్‌వర్క్ వెనుక ఏకంగా గ్యాంగ్‌స్టర్ రవిపూజారి ముఠా లింకులు బయటపడ్డాయి. ముంబై అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం గ్రూప్‌నకు బద్ధశత్రువైన రవి పూజారి గ్యాంగ్‌కు చెందిన శ్యాంసుందర్ (సినీ నటిని బెదిరించిన కేసులో జైలుకు వెళ్లిన వ్యక్తి)కి జైల్లో గంజాయి స్మగ్లర్ విశ్వంబాల్‌తో పరిచయం ఏర్పడింది. విడుదలయ్యాక ఇద్దరూ కలిసి దుబాయ్ మీదుగా బిహార్‌కు చేరిన విదేశీ మారణాయుధాలను కార్లలో ఒడిశాకు తీసుకెళ్లారు.
అక్కడ వ్యానులో 106 కిలోల గంజాయిని లోడ్ చేసి, దానికి పైలట్‌గా శ్యాంసుందర్, విశ్వంబాల్ కారులో బయలుదేరారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ రమేశ్ బృందం భద్రాచలం వద్ద తనిఖీల్లో కారును పట్టుకోగా.. తమ వెనకాలే వ్యాన్ వస్తున్నట్టు నిందితులు ఒప్పుకున్నారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు పాల్వంచ వద్ద కాపుకాసి ఆ వ్యానును సీజ్ చేశారు. అందులో రూ.56 లక్షల విలువైన 106 కిలోల గంజాయితో పాటు ఒక పిస్తోల్, ఐదు రివాల్వర్లు, 40 లైవ్ రౌండ్లు, 12 ఖాళీ మ్యాగజైన్లను దొరకగా.. వాటిని స్వాధీనం చేసుకున్నారు.
