Irumudi Collections: మాస్ మహారాజా ఈజ్ బ్యాక్.. 48 గంటల్లోనే ‘ఇరుముడి’ సంచలనం.. కళ్ళు చెదిరే కలెక్షన్లు

Irumudi Collections: మాస్ మహారాజా ఈజ్ బ్యాక్.. 48 గంటల్లోనే ‘ఇరుముడి’ సంచలనం.. కళ్ళు చెదిరే కలెక్షన్లు

మాస్ మహారాజా రవితేజ చాలా కాలం తర్వాత బాక్సాఫీస్ వద్ద గట్టిగా నిలిచే విజయాన్ని అందుకున్నారు. గత కొన్నేళ్లుగా వరుస పరాజయాలతో సతమతమవుతున్న ఆయనకు ‘ఇరుముడి’ ఊపిరి పోసిన సినిమాగా మారింది. కమర్షియల్ విజయంతో పాటు నటుడిగా రవితేజకు వస్తున్న ప్రశంసలు ఈ చిత్రాన్ని ఆయన కెరీర్‌లో ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి.

ఫ్లాప్‌ల తర్వాత గెలుపు..

‘ధమాకా’ తర్వాత రవితేజ నటించిన పలు చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాయి. బాక్సాఫీస్ వద్ద వరుసగా నిరాశలు ఎదురవడంతో ఆయన మార్కెట్‌పైనా చర్చలు జరిగాయి. అలాంటి సమయంలో శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ‘ఇరుముడి’ ప్రేక్షకుల అంచనాలను మించి స్పందన దక్కించుకుంది.

48 గంటల్లోనే భారీ వసూళ్లు

విడుదలైన తొలి రెండు రోజుల్లోనే ‘ఇరుముడి’ ప్రపంచవ్యాప్తంగా రూ.47.45 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇండియాలో రూ.36.45 కోట్ల గ్రాస్, రూ.31.40 కోట్ల నెట్ రాబట్టగా, ఓవర్సీస్‌లో రూ.11 కోట్ల గ్రాస్ సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో 78.54 శాతం ఆక్యుపెన్సీ, రెండో రోజు నైట్ షోలకు 88.31 శాతం ఆక్యుపెన్సీ నమోదు కావడం సినిమా జోరును చూపిస్తోంది.

 బ్రేక్ ఈవెన్ దాటేసిన ‘ఇరుముడి’..

ప్రపంచవ్యాప్తంగా ‘ఇరుముడి’ దాదాపు రూ.20 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అందువల్ల ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ సాధించాలంటే సుమారు రూ.21 కోట్ల నెట్, రూ.45 కోట్ల గ్రాస్ రాబట్టాల్సి ఉంది. ఇక ఈ రెండ్రోజుల వసూళ్లతోనే ఇరుముడి బ్రేక్ ఈవెన్ టార్గెట్ సాధించిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. మరో మూడు రోజులు ఇదే డిమాండ్ (పాజిటివ్ టాక్, టికెట్ల బుకింగ్స్) కొనసాగితే వీకెండ్ లెక్కతోనే వందకోట్ల క్లబ్ ఖాయం అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు రవితేజ సినిమాల్లో ధమాకా మాత్రమే వందకోట్ల మార్క్ అందుకుంది. మరి ఇరుముడి లెక్కలు ఎక్కడ వరకు చేరుతాయో చూడాలి. 

మాస్ కాదు.. నటుడిగా మెప్పించిన రవితేజ

ఈ సినిమాలో రవితేజ అయ్యప్ప భక్తుడి పాత్రలో పూర్తిగా భిన్నమైన కోణంలో కనిపించారు. ఎప్పటిలా మాస్ డైలాగులు, హై ఎనర్జీ కంటే సెటిల్డ్ మరియు భావోద్వేగ నటనకు ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యంగా తండ్రి–కూతుళ్ల మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తున్నాయని సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

కెరీర్‌కు కొత్త మలుపు?

ట్రేడ్ వర్గాల అభిప్రాయం ప్రకారం, ‘ఇరుముడి’ కేవలం మరో హిట్ సినిమా మాత్రమే కాదు.. రవితేజ మార్కెట్‌ను మళ్లీ బలోపేతం చేసిన కమ్‌బ్యాక్ మూవీగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరుస ఫ్లాప్‌ల తర్వాత వచ్చిన ఈ విజయం, మాస్ మహారాజా కెరీర్‌కు కొత్త ఊపు తీసుకొచ్చిందనే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.