IRUMUDI Review: ‘ఇరుముడి’ రివ్యూ.. ఆడియన్స్ టాక్ ఎలా ఉందంటే?

IRUMUDI Review: ‘ఇరుముడి’ రివ్యూ.. ఆడియన్స్ టాక్ ఎలా ఉందంటే?

రవితేజ హీరోగా డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కించిన చిత్రం ‘ఇరుముడి’ (Irumudi). మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌‌‌‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌‌గా నటించగా, బేబీ నక్షత్ర కీలక పాత్రలో కనిపించింది. డివోషనల్ ఫ్యామిలీ థ్రిల్లర్గా రూపొందిన ఈ మూవీ ఇవాళ (ఆగస్టు 21, 2026న) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలైంది.

టీజర్, ట్రైలర్, సాంగ్స్ తోనే భారీ హైప్ దక్కించుకోవడంతో, ఈ సినిమాపై టాలీవుడ్ వర్గాల్లో మరియు ప్రేక్షకులలో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఓవర్సీస్ ప్రీమియర్స్ అనంతరం, సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకులు తమ ఫస్ట్ టాక్ పంచుకుంటున్నారు. మరి అయ్యప్ప స్వామి దీక్షలో కనిపించిన రవితేజ ఎంతగా ఆకట్టుకున్నాడు? తండ్రీ–కూతుళ్ల అనుబంధాన్ని శివ నిర్వాణ ఎంత భావోద్వేగంగా ఆవిష్కరించాడు? అనేది ఆడియన్స్ టాక్లో తెలుసుకుందాం...

‘ఇరుముడి’ కథ:

భార్య, కూతురును ఎంతో ప్రేమగా చూసుకునే మిడిల్ క్లాస్‌‌ ఫాదర్‌‌‌‌గా రవితేజ కనిపించాడు. ఊరిలోని ప్రతి అమ్మాయిని కూడా తన కూతురిలా భావిస్తాడు. తాగుడు వ్యసనానికి బానిసైన అతను ప్రతి ఏడాది అయ్యప్ప మాల వేసుకుని, పూర్తిగా ప్రశాంతమైన, భిన్నమైన వ్యక్తిగా మారతాడు. మరోవైపు ఆ ఊర్లో వరుసగా అమ్మాయిల హత్యలు జరుగుతుంటాయి. ఆ హత్యలకు కారణం ఎవరు.. వాటిని అతను ఎలా అడ్డుకున్నాడు అనేది మెయిన్ కాన్సెప్ట్‌.

ముఖ్యంగా భక్తితో ప్రారంభమైన రవితేజ అయ్యప్ప యాత్ర, క్రమంగా తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు నిజాన్ని వెతికే భావోద్వేగ పోరాటంగా మారుతుంది. ఆ ప్రయాణంలో వెలుగులోకి వచ్చే రహస్యాలు, కుటుంబాన్ని వెంటాడే ప్రమాదాలు, తన కూతురి కోసం ఒక తండ్రి చేసే సాహసమే ‘ఇరుముడి’ చిత్రంలోని అసలు హృదయం.

ఆడియన్స్ టాక్ ఎలా ఉందంటే?

రవితేజ పెర్ఫార్మెన్స్: మాస్ ఇమేజ్‌కు పూర్తి భిన్నంగా ఒక బాధ్యతగల తండ్రి పాత్రలో రవితేజ అద్భుతంగా నటించారని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. ఆయన కెరీర్‌లో ఇది డిఫరెంట్ రోల్‌గా నిలుస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. కూతురి పాత్రలో నటించిన నక్షత్ర అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిందని అంటున్నారు.

ఎమోషనల్ కథ: అయ్యప్ప దీక్షను కథలో సహజంగా మేళవిస్తూ, తండ్రీ–కూతుళ్ల బంధాన్ని హృదయానికి హత్తుకునేలా చూపించారని ప్రేక్షకుల అభిప్రాయం. కుటుంబ ప్రేక్షకులకు ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుందంటున్నారు. 

ఫస్ట్ హాఫ్–సెకండ్ హాఫ్: మొదటి భాగంలో గ్రామీణ నేపథ్యం, కుటుంబ భావోద్వేగాలు, సస్పెన్స్ ఆసక్తికరంగా సాగితే.. సెకండాఫ్ లో ట్విస్టులు, ఇంటెన్స్ డ్రామా సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయని టాక్. ముఖ్యంగా సినిమాలో కొన్ని కీలక ట్విస్టులు ఉన్నప్పటికీ, అవి కథలోని ఎమోషనల్ కోర్ ఎక్కడా దెబ్బతినకుండా కొనసాగుతుందని అంటున్నారు. ఈ క్రమంలోనే, క్లైమాక్స్ చాలా బాగా వర్కౌట్ అయిందని, సినిమాకు ప్రధాన బలంగా నిలిచిందని ఆడియన్స్ తమ రివ్యూ ద్వారా అభిప్రాయపడుతున్నారు. 

మ్యూజిక్ & క్లైమాక్స్: జీవీ ప్రకాష్ కుమార్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచిందని, క్లైమాక్స్ ఎమోషనల్ వేలో ఉండటంతో ఆడియన్స్ కు మంచి ఫీల్ ఇస్తుందని సోషల్ మీడియాలో రివ్యూలు వస్తున్నాయి. ముఖ్యంగా ‘మల్లెపూల పల్లకి’ పాట నేపథ్యంలోని యాక్షన్ ఎపిసోడ్ థియేటర్లలో మంచి రెస్పాన్స్ అందుకుంటోందట.

ఓవరాల్ టాక్..

మొత్తంగా చూస్తే, ‘ఇరుముడి’కు ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ లభిస్తోంది. బలమైన భావోద్వేగాలు, రవితేజ పరిణతి చెందిన నటన, శివ నిర్వాణ టేకింగ్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయని ఓవర్సీస్ ప్రీమియర్ ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు. కథనం కొన్ని చోట్ల నెమ్మదిగా అనిపించినా, బలమైన భావోద్వేగాలు, రవితేజ హృదయాన్ని తాకే నటన, శివ నిర్వాణ తెరకెక్కించిన విధానం ‘ఇరుముడి’కి ప్రధాన బలాలుగా నిలిచాయని ఫస్ట్ షో చూసిన 
ఆడియన్స్ రివ్యూలు చెబుతున్నాయి. అయితే ఇది ఫస్ట్ షో చూసిన ఆడియన్స్ రియాక్షన్స్ మాత్రమే. అంటే దాదాపు రవితేజ ఫ్యాన్సే ఎక్కువ చూస్తారు కాబట్టి.. ఇవాళ సాయంత్రం లోపు వచ్చే ప్రేక్షకుల స్పందనతో మరింత క్లారిటీ వస్తుంది.