నటి రేణు దేశాయ్ సినిమాల్లో కనిపించిడం తగ్గించినప్పటికీ.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ముఖ్యంగా ఆధ్యాత్మిక సేవ, మూగజీవాల సంరక్షణ కోసం ఆమె పడే తపన అంతా ఇంతా కాదు. సామాజిక అంశాలపై స్పందిస్తూ.. నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా తన పిల్లలు అకీరా నందన్, ఆద్యల పెంపకం గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
రేణు భావోద్వేగం..
పవన్ కల్యాణ్ నుంచి విడిపోయిన 15 ఏళ్ల తర్వాత కూడా, రేణు దేశాయ్ తన పిల్లలను బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దుతుంది. పవన్ కల్యాణ్ మరో వివాహం చేసుకుని తన కొత్త కుటుంబంతో ఉన్నప్పటికీ, అకీరా , ఆద్య తరచుగా తమ తండ్రిని, మెగా కుటుంబ సభ్యులను కలుస్తూనే ఉంటారు. ఈ క్రమంలో, మెగా ఇంటికి పంపే ముందు తన పిల్లలకు ఆమె ఇచ్చే సలహా ఏమిటన్న ప్రశ్నపై రేణు అత్యంత భావోద్వేగానికి గురయ్యారు.
పిల్లలే ప్రతిబింబాలు
పిల్లలు మెగా ఫ్యామిలీ వద్దకు వెళ్లేటప్పుడు వారిని ఎలా సిద్ధం చేస్తారని యాంకర్ అడిగిన ప్రశ్నకు రేణు స్పందిస్తూ.. నేను నా పిల్లలకు ఎప్పుడూ ఒకే మాట చెబుతాను. మీరు బయట ఎలా ప్రవర్తిస్తారనేది నా పెంపకాన్ని సూచిస్తుంది. మీరు మర్యాదగా ఉంటే, మీ తల్లి మిమ్మల్ని బాగా పెంచిందని అందరూ అంటారు. అదే పొరపాటు చేస్తే, 'తల్లి పెంపకం సరిగ్గా లేదు' అనే మాట పడుతుంది. ఆ మచ్చ నాపై పడకూడదని కోరుకుంటాను అని తెలిపారు.
అవే నా ఆస్తులు
రేణు దేశాయ్ తన పిల్లలకు నేర్పిన అత్యంత ముఖ్యమైన పాఠం గౌరవం. నేను మంచి హీరోయిన్‌నా కాదా, నేను అందంగా ఉన్నానా లేదా, నేను ఎంత సామాజిక సేవ చేస్తున్నాను అనేది నాకు ముఖ్యం కాదు. కానీ, ఒక తల్లిగా నేను విజయం సాధించానా లేదా అనేది నా పిల్లల ప్రవర్తనను బట్టే ప్రపంచానికి తెలుస్తుంది. మెగా ఫ్యామిలీ వద్దకు వెళ్లినప్పుడు ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా మర్యాదగా ఉండమని చెబుతాను. ఒకవేళ మీకు అక్కడ ఏదైనా ఇబ్బందిగా అనిపించినా, కోపం వచ్చినా.. వెంటనే నాకు ఫోన్ చేయండి, కానీ ఎవరిపైనా అసహనం ప్రదర్శించవద్దు అని ఆమె పిల్లలకు దిశానిర్దేశం చేస్తారట.
ఈ విషయాలను పంచుకుంటున్న సమయంలో రేణు కళ్లలో నీళ్లు తిరిగాయి. తన పిల్లలిద్దరూ చాలా మంచి మనసున్న వారని, వారి క్రమశిక్షణే తనకు గర్వకారణమని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. విడిపోయినప్పటికీ పిల్లలను తండ్రి కుటుంబంతో సఖ్యతగా ఉండేలా ప్రోత్సహిస్తూ, అదే సమయంలో తన పెంపకం యొక్క విలువను కాపాడుకుంటున్న రేణు దేశాయ్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒక మదర్‌గా ఆమె పడుతున్న తపన, పిల్లల పట్ల ఆమెకున్న బాధ్యత నిజంగా స్ఫూర్తిదాయకం అని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
"Aadya & Akira Family దెగ్గరికి వెళ్ళే ముందు ఒక్కటే చెప్పాను మీరు వాళ్ళతో ఎలా behave చేస్తారో అది నా పెంపకాన్ని reflect చేస్తుందని" - #RenuDesai
— Vedi..VediGa... (@vedivediga) April 27, 2026
Credits - @TV9Telugu pic.twitter.com/Q6bddxZyoF

