మనం డైలీ తినే ఆహారంలో అతిగా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల పరిమాణాన్ని 10 శాతం తగ్గించడం వల్ల పెద్ద ప్రేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చు. బిస్కెట్లు, ఇన్స్టంట్ నూడుల్స్, తీపి పానీయాలు, చిప్స్, ప్రాసెస్ చేసిన మాంసం వంటివి తినడం మానేస్తే చాలు. క్యాన్సర్ ప్రమాదం నుంచి వీలైనంత దూరంగా ఉండొచ్చు. ఈ రోజుల్లో, మనకు కొద్దిగా ఆకలిగా అనిపించినప్పుడల్లా ఫోన్ తీసుకుని ఫుడ్ ఆర్డర్ చేయడం డైలీ రొటీన్‌గా మారిపోయింది. కొందరికి ఇదొక అలవాటుగా మారింది.
అయితే.. ఈ అలవాటు మన శరీరంలో ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల పరిమాణాన్ని వేగంగా పెంచుతుందనే విషయాన్ని మర్చిపోతున్నాం. ఇలా ప్రాసెస్ చేసిన ఆహారాలను, ఇన్ స్టాంట్ ఫుడ్స్‌ను, ఫాస్ట్ ఫుడ్స్‌ను నిరంతరం తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు, పెద్ద ప్రేగు క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉంది. అందువల్ల.. వీలైనంత వరకూ ఇంట్లో వండుకుని తినడం వల్ల ఆరోగ్యంగా ఉండటం మాత్రమే కాదు ఖర్చు కూడా తగ్గుతుంది. అల్పాహారంలో తృణధాన్యాలు, రొట్టె ఎక్కువగా తినేవారిలో పేగు క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా తక్కువగా ఉన్నాయి.
శరీరంలోని ఏదైనా ఒక అవయవ భాగంలో కణజాలం అపరిమితంగా నియంత్రణ లేకుండా పెరగడం, ఇతర కణజాలాలకు వ్యాపించడం వల్ల ఆయా భాగాల్లో గడ్డలు లేదా పుండు ఏర్పడడాన్ని క్యాన్సర్ వ్యాధిగా పిలుస్తారు. ప్రాణాంతక క్యాన్సర్‌కు సరైన చికిత్స లేదు. కానీ, తొలిదశలోనే గుర్తించడం వల్ల చికిత్సతో నయం చేయవచ్చు.
