- మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
కొల్లాపూర్, వెలుగు: ప్రభుత్వం తమకు పనులు అప్పగిస్తే నార్లాపూర్ నీటితో రిజర్వాయర్లను నింపి చూపిస్తామని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. నార్లపూర్ నుంచి కిందికి నీళ్లను ఎలా తీసుకుపోవాలో బీఆర్ఎస్ లీడర్లు చెప్పాలని బుధవారం మంత్రి జూపల్లి విసిరిన సవాల్‌కు ఆయన స్పందిస్తూ గురువారం మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డితో కలిసి నార్లపూర్ రిజర్వాయర్‌ను సందర్శించారు.
ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ కుడికిళ్ల వద్ద రెండు పంపుల సామర్థ్యానికి సరిపోను తుండు కట్టను తొలగిస్తే గ్రావిటీ ద్వారా ఏదుల, వట్టేం, కర్వేనా రిజర్వాయర్లకు నీళ్లు తరలించవచ్చన్నారు. నార్లపూర్ వద్ద 10 పంపులు ఒకేసారి నడిస్తే 26 వేల క్యూసెక్కుల నీళ్లు కాలువ ద్వారా పారుతాయని, ప్రస్తుతం రెండు పంపులు మాత్రమే నడుస్తున్నందున తుండు కట్టలో పావు భాగం మట్టిని తొలగించినా గ్రావిటీ ద్వారా నీరు రిజర్వాయర్లకు చేరుకుంటుందని వివరించారు.
మూడేండ్లుగా పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పడావు పెట్టి, కుంటి సాకులతో రైతులను అరిగోస పెడుతున్నారని విమర్శించారు. జూరాల ద్వారా శ్రీశైలం ప్రాజెక్టులోకి 245 టీఎంసీల నీళ్లు చేరినప్పటికీ, సీఎం రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం కారణంగా 100 టీఎంసీలకు పైగా నీరు ఆంధ్రాకు తరలిపోయిందని ఆరోపించారు. ప్రస్తుతం శ్రీశైలంలో 60 టీఎంసీల నీరుందని, అందులో 20 టీఎంసీలు ఎత్తిపోస్తే వానాకాలం పంటలను కాపాడవచ్చన్నారు.
