- విదేశీ బొగ్గు దందా కోసమే ఈ ప్లాంట్ నిర్మాణం
- దిగుమతి బొగ్గు కోసం 2016లో ఎంఎస్టీసీతో ఒప్పందం
- ఇందుకోసం ఓ ముసుగు వీరుడితో
- నమస్తే తెలంగాణలో 100 కోట్ల పెట్టుబడులు
- కేటీఆర్ ‘విదేశీ బొగ్గు’ స్కాం ఆరోపణలు పచ్చి అబద్ధం
- దిగుమతి బొగ్గు కోసం మేము ఏ టెండర్లలో పాల్గొనలే
- బొగ్గు కొనుగోళ్లపై ఏ దర్యాప్తుకైనా సిద్ధమని ప్రకటన
- కృష్ణా జలాల్లో రాష్ట్ర ప్రయోజనాలను బీఆర్ఎస్ దెబ్బతీసిందని ఫైర్
హైదరాబాద్, వెలుగు: యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌తో రాష్ట్ర ప్రజలపై గత కేసీఆర్ ప్రభుత్వం రూ.లక్ష కోట్ల భారాన్ని మోపిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. యదాద్రి ప్లాంట్నిర్మాణంలో కనీవినీ ఎరుగని రీతిలో అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు. విదేశాల నుంచి బొగ్గు కొనుగోళ్లు అంటూ.. ఈ వ్యవహారంలో తనపై విచారణ జరిపించాలని కోరుతూ కేటీఆర్ లేఖ రాయడం విడ్డూరంగా ఉందని, ఆ సవాల్‌ను తాను స్వీకరిస్తున్నానని సీఎం ప్రకటించారు. కేటీఆర్ కోరినట్లుగా సీబీఐ, ఈడీ, ఆదాయపు పన్ను శాఖ, విజిలెన్స్ లేదా సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణకు తాము సిద్ధమన్నారు.
ఏ దర్యాప్తు కావాలో కేటీఆరే తేల్చుకోవాలని స్పష్టం చేశారు. 2015 నుంచి 2023 వరకు యాదాద్రి పవర్ ప్లాంట్ ముసుగులో జరిగిన ప్రతి రూపాయి దోపిడీపై సమగ్ర విచారణ జరిపిస్తామన్నారు. బొగ్గు గనులున్న మంచిర్యాల, చెన్నూరు, రామగుండం లేదా కొత్తగూడెం ప్రాంతాల్లో పిట్-హెడ్ వద్ద కాకుండా, కమీషన్ల కోసమే దామరచర్లలో ప్రాజెక్టు పెట్టారని దుయ్యబట్టారు. బొగ్గు బావి పక్కన ప్లాంట్ కడితే రవాణా ఖర్చులు మిగులుతాయి. అలాంటిది దామరచర్లలో ఎందుకు కట్టారని ప్రశ్నించారు. 2015లో కేవలం రూ.17,950 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభమైన ఈ ప్రాజెక్టును, ఏకంగా రూ.37,781 కోట్లకు 110 శాతం పెంచేశారని ఒప్పంద పత్రాలు చూపించారు. ఎన్టీపీసీ (రామగుండం 1,600 మెగావాట్లు), సింగరేణి సంస్థలు మెగావాట్‌కు రూ.7.5 కోట్ల వ్యయంతో ప్లాంట్లు నిర్మిస్తుంటే, యాదాద్రిలో మెగావాట్ ఖర్చును రూ.9.5 కోట్లకు పెంచి అదనంగా రూ.8,000 కోట్లను కొల్లగొట్టారన్నారు. కొత్తగూడెం ఏడో దశలో యూనిట్ విద్యుత్ ఉత్పత్తి వ్యయం రూ.4.29, సింగరేణిలో రూ.4.29 ఉండగా, యాదాద్రిలో యూనిట్ ధర రూ.6.66కు చేరిందని.. దీనివల్ల ప్రజలపై యూనిట్‌కు రూ.2.61 చొప్పున అదనపు భారం పడుతోందన్నారు. ప్రాజెక్టు జీవితకాలమైన 25 నుంచి 50 ఏళ్లలో ప్రజలపై రూ.50,000 కోట్ల నుంచి రూ.80,000 కోట్ల రికరింగ్ భారం పడుతుందని, మొత్తంగా ఈ నష్టం విలువ రూ.లక్ష కోట్లకు పైమాటేనని సీఎం వివరించారు.
విదేశీ బొగ్గు కోసమే ప్రత్యేక బాయిలర్లు
విదేశీ బొగ్గు దిగుమతి వ్యాపారం కోసమే యాదాద్రి ప్లాంట్‌ను నిబంధనలకు విరుద్ధంగా డిజైన్ చేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్లాంట్‌కు ఏటా 14 మిలియన్ మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరమని, అందులో 50 శాతం అంటే 7 మిలియన్ టన్నులను కృష్ణపట్నం పోర్టు ద్వారా దిగుమతి చేసుకోవాలని నిర్ణయించారని చెప్పారు. ఇందుకోసం 2016 డిసెంబర్ 9న జెన్కో, ఎంఎస్టీసీ మధ్య ఒప్పందం జరిగిందని, అదే నెల 7న అప్పటి సీఎం రైల్వే శాఖకు లేఖ రాశారని ఆధారాలు చూపించారు. 5,600 క్యాలరిఫిక్ వ్యాల్యూ ఉన్న గ్రేడ్-9 విదేశీ బొగ్గుకు అనుగుణంగా బాయిలర్లను డిజైన్ చేయించి, సింగరేణిలో లభించే గ్రేడ్-12 నుంచి 14 దేశీయ బొగ్గు వినియోగాన్ని అడ్డుకున్నారని మండిపడ్డారు. ‘‘ఏ బొగ్గయినా ఒకటే’’ అంటూ అప్పటి విద్యుత్ మంత్రి జగదీశ్ రెడ్డి, కేటీఆర్ వాదించడం సరికాదన్నారు.
‘‘చివాస్ రీగల్, రాయల్ సెల్యూట్, ధూల్‌పేట సారా ఒక్కటేనా? నాసిరకం బొగ్గు వాడితే బాయిలర్లు పేలిపోతాయి’’ అని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో సెఫాలజిస్టులు, సైకాలజిస్టులను చూశామని, ఇప్పుడు సోడా కలిపే మిక్సాలజిస్టులను చూస్తున్నామని ఎద్దేవా చేశారు. కృష్ణపట్నం ప్రైవేట్ పోర్టు, దిగుమతి చేసుకునే బొగ్గు ప్రైవేట్ సంస్థలదేనని, వాటి మధ్య ఉన్న ‘ముసుగువీరుడు’ ఎవరని సీఎం ప్రశ్నించారు. నష్టాల్లో ఉన్న ‘నమస్తే తెలంగాణ’ పత్రికలో ప్రతిమా మూర్తి అనే వ్యక్తితో రూ.100 కోట్ల విలువైన షేర్లు కొనిపించి, దానికి ప్రతిఫలంగా విదేశీ బొగ్గు దిగుమతి దందా నడిపారని ఆరోపించారు. ‘‘ఆ రూ.100 కోట్లు పెట్టి షేర్లు కొన్నదెవరు? ప్రతిమా మూర్తి పెట్టుబడి పెట్టాడని చెప్పి బొగ్గు దందా చేశారా?’’ అని నిలదీశారు.
భద్రాద్రి ప్లాంట్‌ను నామినేషన్‌పై కట్టబెట్టారు
ఖమ్మంలోని 1,040 మెగావాట్ల భద్రాద్రి ప్లాంట్‌ను కేవలం మూడు వారాల్లో నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని రేవంత్ రెడ్డి అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డితో మాట్లాడి, ఒడిశాలోని మహానది కోల్ ఫీల్డ్స్ నుంచి నాణ్యమైన దేశీయ బొగ్గును రాయితీపై రైళ్ల ద్వారా తరలించేలా కేంద్రాన్ని ఒప్పించామని చెప్పారు. కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, అశ్వినీ వైష్ణవ్లతో కూడిన హైపవర్ కమిటీ ద్వారా బొగ్గు కేటాయింపులు సాధించామన్నారు. 2024లో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించి ఎన్జీటీ స్టేను ఎత్తివేయించడంతో యాదాద్రి ప్రాజెక్టును కాపాడుతున్నామని వివరించారు. యాదాద్రి బొగ్గు కొనుగోళ్లపై ఏ విచారణకైనా సిద్ధమని, బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీలో ముఖాముఖి చర్చకు రావాలని సవాల్ విసిరారు. ‘‘మేము అబద్ధాలు చెప్తాం, ఊరు బయట తిరుగుతాం.. దొంగలాగా మాట్లాడతాం, దొంగ తిరుగుళ్లు తిరుగుతాం.. ‘దొంగది కాదు దొడ్లోకి రాదు’ అన్నట్టుంది వీరి తీరు. దమ్ముంటే అసెంబ్లీ చర్చకు రావాలి’’ అని సవాల్ చేశారు.
కేటీఆర్ ముఖానికి బొగ్గు పూసుకున్నడు
గతంలో డ్రగ్స్ ఆరోపణలు, ఫామ్‌హౌస్, స్టార్ హోటల్ వివాదాలు వచ్చినప్పుడు కూడా కేటీఆర్ ఇలాగే బుకాయించారని రేవంత్ రెడ్డి విమర్శించారు. యాదాద్రి విదేశీ బొగ్గు వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయి ముఖానికి బొగ్గు పూసుకున్నారని ఎద్దేవా చేశారు. గత ఆరోపణల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే గడ్డం పెంచుకొని, కొత్త గెటప్‌తో మారువేషంలో తిరుగుతున్నారని సెటైర్లు వేశారు. తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మరని, నిజాలు బయటపడితే తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియని పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.
ఎవనిదో కత్తి.. ఎవనిదో నెత్తి
తాను ప్రారంభించిన ఆస్పత్రులపై వస్తున్న ఆరోపణలకు సీఎం స్పందించారు. ‘‘ఎవనిదో నెత్తి.. ఎవనిదో కత్తి అన్నట్టు వ్యవహారం తయారైంది. ప్రైవేట్ వ్యక్తులు ఆస్పత్రులు కడితే కేసీఆర్, కిషన్ రెడ్డి, నేను కూడా ప్రారంభించాం. అంతమాత్రాన ఆ ఆస్తులన్నీ నావైపోతాయా? అలా అయితే ప్రపంచంలోనే అత్యంత శ్రీమంతుడిని నేనే అవుతా’’ అని రేవంత్ వ్యాఖ్యానించారు.
ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు ప్రాజెక్టు నీళ్లా?
రాష్ట్ర ప్రజలు, రైతులు నీటి కోసం అల్లాడుతుంటే మాజీ సీఎం కేసీఆర్ తన 500 ఎకరాల ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు ప్రభుత్వ ప్రాజెక్టు నీటిని అక్రమంగా మళ్లించుకుంటున్నారని రేవంత్ ఆరోపించారు. ప్రజాధనంతో నిర్మించిన కొండపోచమ్మ సాగర్ నుంచి కాలువ ద్వారా పంచపాండవుల చెరువుకు నీటిని తరలించి, అక్కడ భారీ పంపులతో ఫామ్‌హౌస్‌లోకి తోడుకుంటున్నారని అన్నారు. దీనిపై కేటీఆర్, హరీశ్‌రావులు నిజనిర్ధారణ కమిటీతో రావాలని, తాను నేరుగా ఫామ్‌హౌస్ వద్దకు వస్తానని చెప్పారు. అక్రమ పంపుల కనెక్షన్లు తొలగించే దమ్ముందా అని సవాల్ విసిరారు.
గోదావరి ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో రూ.లక్ష కోట్లు ఖర్చుచేసి మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలు దెబ్బతినే పరిస్థితి తెచ్చారని ఆరోపించారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు తాగునీరు దొరకని పరిస్థితిలో కొండపోచమ్మ నుంచి పంచపాండవుల చెరువు మీదుగా ఫామ్‌హౌస్‌కు కాలువ తవ్వి, పంపులతో నీటిని ఎలా తరలిస్తున్నారని నిలదీశారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసింది కేసీఆరేనని సీఎం ఆరోపించారు. 2015లో అప్పటి సీఎం హోదాలో ఢిల్లీ వెళ్లిన కేసీఆర్, బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ముందు ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు సరిపోతాయని సంతకం చేసి రైతుల ప్రయోజనాలను దెబ్బతీశారని విమర్శించారు. 2022లోనూ అదే అన్యాయమైన వాటాను శాశ్వతం చేసేలా వ్యవహరించారని ఆరోపించారు.
