RGV 'పోలీస్ కంపెనీ': D కంపెనీ కంటే డేంజర్.. ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా హర్షవర్ధన్ రాణే!

RGV 'పోలీస్ కంపెనీ': D కంపెనీ కంటే డేంజర్.. ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా హర్షవర్ధన్ రాణే!

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) మరోసారి తన మార్క్ అండర్‌వర్ల్డ్ క్రైమ్ థ్రిల్లర్‌తో బాక్సాఫీస్ వద్ద రచ్చ చేయడానికి సిద్ధమయ్యారు. 'సిండికేట్' సినిమా అప్‌డేట్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు ఊహించని షాక్ ఇస్తూ.. తన కొత్త ప్రాజెక్ట్ 'పోలీస్ కంపెనీ' (Police Company) ని అధికారికంగా ప్రకటించారు. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ టీ-సిరీస్ (T-Series) భాగస్వామ్యంతో ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు.  "ఇట్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ డి కంపెనీ" అంటూ ఈ సినిమాకు పెట్టిన ట్యాగ్‌లైన్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

అసలు ఏంటి ఈ ‘పోలీస్ కంపెనీ’?

1990ల ముగింపు, 2000ల ప్రారంభంలో ముంబై నగరాన్ని దావూద్ ఇబ్రహీం, ఛోటా రాజన్ ముఠాలు రక్తసిక్తం చేశాయి. ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన యువత నేరప్రపంచంలోకి ఎంట్రీ అవడంతో లా అండ్ ఆర్డర్ పూర్తిగా కుప్పకూలింది. ఈ పరిస్థితిని అదుపు చేయడానికి ముంబై పోలీసులు ఒక ప్రత్యేక 'ఎన్‌కౌంటర్ స్క్వాడ్'ను ఏర్పాటు చేశారు. 1997 నుండి 2004 మధ్య కాలంలో ఈ స్క్వాడ్ ఏకంగా 300 మందికి పైగా గ్యాంగ్‌స్టర్లను ఎన్‌కౌంటర్‌లో లేపేసింది. పోలీస్ అనేది ఒక సంస్థ, అండర్‌వరల్డ్ కంపెనీ అనేది డబ్బు సంపాదించే ఒక సంస్థ.. కానీ  "అధికారం చేతికి వస్తే ఒక వ్యవస్థే కంపెనీలా ఎలా మారుతుంది?" అనే క్రేజీ పాయింట్‌తో ఈ సినిమా చూపించబోతున్నారు ఆర్జీవీ..

 

ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ హర్షవర్ధన్ రాణే..

ఈ స్పెషల్ స్క్వాడ్‌లో కీలక పాత్ర పోషించిన రియల్ లైఫ్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్ జీవితం, సంఘటనల ఆధారంగా ఈ కథను రూపొందించారు. 'సనమ్ తేరీ కసమ్', 'హసీన్ దిల్‌రుబా'చిత్రాలతో మెప్పించిన హర్షవర్ధన్ రాణే ఇందులో దయా నాయక్ పాత్రలో కనిపించనున్నారు. ఆర్జీవీ విడుదల చేసిన హర్షవర్ధన్ రఫ్ అండ్ టఫ్ ఫస్ట్ లుక్ స్టిల్స్ ప్రేక్షకుల్లో అంచనాలను ఆకాశానికి ఎత్తేశాయి.

'సత్య', 'కంపెనీ' వంటి క్లాసిక్స్ అందించిన ఆర్జీవీ, మళ్ళీ ముంబై అండర్‌వర్ల్డ్ బ్యాక్‌డ్రాప్‌లోకి దిగడం క్రైమ్ సినిమాల ప్రియులకు పూనకాలు తెప్పిస్తోంది. మరోవైపు మనోజ్ బాజ్‌పాయ్‌తో 'పోలీస్ స్టేషన్ మే భూత్'చేస్తున్న వర్మ, ఈ 'పోలీస్ కంపెనీ'తో బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ విధ్వంసం సృష్టిస్తారో చూడాలి. ఈ భారీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌లోని మిగతా నటీనటుల వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.