పాప పరిహారం దిశగా ఆర్జీవీ.. బాలీవుడ్, టాలీవుడ్ హీరోలతో 'సిండికేట్' మూవీ!

పాప పరిహారం దిశగా ఆర్జీవీ.. బాలీవుడ్, టాలీవుడ్ హీరోలతో 'సిండికేట్' మూవీ!

సినీ ఇండస్ట్రీలో సంచలన దర్శకుడుగా రామ్ గోపాల్ వర్మకు పేరు. అయితే గత కొంతకాలంగా ఆయన నుంచి పవర్‌ఫుల్ సినిమాలు రావడం లేదన్నది అభిమానుల వెలితి. కానీ, తాజాగా వర్మ ఒక భారీ క్రైమ్ యాక్షన్ డ్రామా 'సిండికేట్' (Syndicate) తో మళ్లీ ఫామ్‌లోకి రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి వస్తున్న తాజా అప్‌డేట్స్ ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది.

గురువు కోసం శిష్యుడి అండ?

2025లో రామ్ గోపాల్ వర్మ 'సిండికేట్' సినిమాను ప్రకటించినప్పుడు అది కేవలం మరో గ్యాంగ్‌స్టర్ సినిమా అనుకున్నారంతా. కానీ, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌లోకి నేషనల్ అవార్డ్ విన్నర్, 'ధురంధర్' చిత్రాల దర్శకుడు ఆదిత్య ధర్ ఎంట్రీ ఇవ్వడం ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన 'ధురంధర్' , తాజాగా విడుదలైన 'ధురంధర్ 2: ది రివెంజ్' బాక్సాఫీస్ వద్ద వేల కోట్లు కొల్లగొట్టి ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాశాయి. వర్మ సోషల్ మీడియాలో ఆదిత్యను తన "కొత్త గురువు" అని అభివర్ణించడమే కాకుండా, ధురంధర్ సినిమా ప్రభావంతో తన పాత సినిమాల స్టైల్‌ను మార్చుకుంటున్నట్లు ప్రకటించారు.

అయితే  లేటెస్ట్ సమాచారం ప్రకారం, ఆదిత్య ధర్ తన సొంత నిర్మాణ సంస్థ B62 స్టూడియోస్ ద్వారా 'సిండికేట్' చిత్రాన్ని నిర్మించబోతున్నారు. కేవలం నిర్మాతగానే కాకుండా, ఆదిత్య ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో కూడా వర్మకు సహకరిస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ మూవీపై అంచనాలు తారా స్థాయికి చేరాయి. మళ్లీ ఆర్టీవీ తన మునుపటి మార్క్ ను చూపించబోతున్నారని సినీ ఇండస్ట్రీలో జోరుగా టాక్ వినిపిస్తోంది.

అసలు ఏంటి ఈ 'సిండికేట్'?

ఈ సినిమా కథాంశం గురించి వర్మ పంచుకున్న విషయాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి.  ఇది భూగర్భ నేర సామ్రాజ్యం గురించి మాత్రమే కాదు. రాజకీయ నాయకులు, పోలీస్ యంత్రాంగం, కార్పొరేట్ దిగ్గజాలు,  మిలిటరీ శక్తులు కలిసి ఏర్పరిచిన ఒక భయంకరమైన 'సిండికేట్' భారత్‌కు ఎలా ముప్పుగా మారిందనేదే ఈ చిత్ర ప్రధానాంశం.  అల్-ఖైదా, ఐసిస్ (ISIS) వంటి తీవ్రవాద సంస్థల ఆవిర్భావం ,  అవి సమాజంపై చూపే ప్రభావాన్ని ఇందులో లోతుగా చూపించబోతున్నట్లు తెలుస్తోంది.

►ALSO READ | Viral Video: 'బలగం' బ్యూటీ కావ్యతో కాల భైరవ లవ్.. త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారా?

వర్మ ఎమోషనల్..

మనిషి కంటే భయంకరమైన జంతువు మరొకటి లేదు అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా సాగుతుందని ఆర్జీవీ తెలిపారు. ఇందులో ఎలాంటి అతీంద్రియ శక్తులు ఉండవు, కేవలం మనుషుల స్వార్థం, క్రూరత్వం మాత్రమే కనిపిస్తాయి. తన "సినిమా పాపాలను" కడిగేసుకునేందుకు చేస్తున్న ప్రయత్నమే ఈ 'సిండికేట్' అని వర్మ ఎమోషనల్ అయ్యారు.

పాన్ ఇండియా లెవల్!

ఈ సినిమాలో నటించే నటీనటుల విషయంలో గతంలో చాలా పుకార్లు వచ్చాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారు. వీరితో పాటు సౌత్ ఇండియా నుంచి విక్టరీ వెంకటేష్, మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్, మనోజ్ బాజ్‌పాయ్ వంటి పవర్‌ఫుల్ నటులు ఈ ప్రాజెక్ట్‌లో భాగం కాబోతున్నట్లు బలమైన వార్తలు వినిపిస్తున్నాయి.

రామ్ గోపాల్ వర్మ మార్క్ మేకింగ్, ఆదిత్య ధర్ విజన్ తోడైతే 'సిండికేట్' మరో 'సత్య' లేదా 'కంపెనీ' రేంజ్ క్లాసిక్‌గా నిలుస్తుందనడంలో సందేహం లేదు అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. 'సర్కార్ 4' పక్కన పెట్టి మరీ వర్మ ఈ ప్రాజెక్ట్ మీద ఫోకస్ చేశారంటేనే దీని రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు అని చెబుతున్నారు.