గిల్‌క్రిస్ట్‌ వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసిన పంత్.. టెస్టుల్లో 100 సిక్సర్లు పూర్తి! 

గిల్‌క్రిస్ట్‌ వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసిన పంత్.. టెస్టుల్లో 100 సిక్సర్లు పూర్తి! 

Rishabh Pant: భారత వికెట్‌కీపర్-బ్యాటర్ రిషభ్ పంత్ టెస్ట్ క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ సుదీర్ఘ ఫార్మాట్‌లో 100 సిక్సర్లు పూర్తి చేసుకున్న తొలి భారతీయ బ్యాటర్‌గా అరుదైన మైలురాయిని అందుకని రికార్డు పుస్తకాల్లో తన పేరును లిఖించుకున్నాడు. భారత్ ఆడుతున్న తాజా టెస్ట్ మ్యాచ్‌లో తన ట్రేడ్‌మార్క్ అటాకింగ్ షాట్‌తో ఈ ఘనత సాధించాడు. అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే 100 లేదా అంతకంటే ఎక్కువ సిక్సర్లు బాదిన నాలుగో బ్యాటర్‌గా పంత్ నిలిచాడు.

గిల్‌క్రిస్ట్‌ రికార్డుని బ్రేక్ చేసిన పంత్: 

రిషభ్ పంత్ అటాకింగ్ శైలి ఎంత ప్రమాదకరమైనదో అతని గణాంకాలే చెబుతున్నాయి. టెస్టుల్లో ప్రతి 49 బంతులకు ఒక సిక్సర్ చొప్పున బాది పంత్ సంచలనం సృష్టించాడు. ఈ విషయంలో దిగ్గజ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ (ప్రతి 67 బంతులకు ఒక సిక్సర్) రికార్డును కూడా పంత్ సునాయాసంగా బ్రేక్ చేసేశాడు. 

ఒత్తిడిలోనూ పంత్ సూపర్ హాఫ్ సెంచరీ: 

తరచుగా విమర్శలు ఎదుర్కొనే పంత్, కష్టసమయంలో జట్టుకు కొండంత అండగా నిలిచాడు. మొదటి సెషన్‌లో భారత్ వరుసగా వికెట్లు కోల్పోయి కుప్పకూలే ప్రమాదంలో పడిన వేళ, పంత్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. ఈ క్రమంలోనే పంత్ తన టెస్ట్ కెరీర్‌లో 20వ అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నాడు. జట్టుకు టాప్ స్కోరర్‌గా నిలిచి, భారత జట్టు ఆధిక్యాన్ని 350 పరుగుల దాకా తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు.

►ALSO READ | క్రికెట్‌కు బిగ్ షాక్: అర్జున అవార్డుల్లో ఏ ఒక్క క్రికెటర్కి దక్కని ఛాన్స్.. నెట్టింట ఫ్యాన్స్ ఫైర్!

ప్రపంచ టెస్ట్ రికార్డుల జాబితా: 

టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన విధ్వంసకర బ్యాటర్ల ఎలైట్ క్లబ్‌లో పంత్ చేరాడు. ఈ జాబితాలో టాప్–4లో ఉన్న ఆటగాళ్ళు:

* బెన్ స్టోక్స్ – 138 సిక్సర్లు

* బ్రెండన్ మెక్‌కలమ్ – 107 సిక్సర్లు

* రిషభ్ పంత్ – 100* సిక్సర్లు

* ఆడమ్ గిల్‌క్రిస్ట్ – 100 సిక్సర్లు