- పెరుగుతున్న జీవన వ్యయం, ఆర్థిక ఒత్తిడి
- ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో అసంతృప్తి
- వేలాదిగా రోడ్డెక్కుతున్న సామాన్యులు
పారిస్/ వాషింగ్టన్/ న్యూఢిల్లీ: పాశ్చాత్య దేశాల్లో ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది. రోజురోజుకూ పెరిగిపోతున్న నిత్యావసరాల ధరలతో సామాన్యులు విసిగిపోతున్నారు. ద్రవ్యోల్బణం కారణంగా ఖర్చులు పెరగడం, ఆమేరకు ఆదాయం మాత్రం పెరగకపోవడంతో ఆర్థిక ఒత్తిడికి లోనవుతున్నారు. ఇంటి అద్దెలు, గృహ నిర్మాణ ఖర్చులు, రవాణా ఖర్చులు విపరీతంగా పెరగడంతో ధరల నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని నిరసన తెలుపుతున్నారు. ఓవైపు జీవన వ్యయం నానాటికీ పెరిగిపోతుంటే రోజు గడిచేదెట్లాననే ఆందోళన, మరోవైపు సామాజిక ఖర్చులకు వెచ్చించే నిధుల్లో ప్రభుత్వం కోతలు పెట్టడంపై మండిపడుతున్నారు.
ఫ్రాన్స్ నుంచి మొదలుకొని అగ్రరాజ్యం అమెరికా దాకా.. వివిధ దేశాల్లో జరుగుతున్న ఆందోళనలు అన్నింటికీ మూలం ప్రధానంగా ఆర్థిక ఒత్తిడి, ప్రభుత్వ విధానాలపై అసంతృప్తి మాత్రమేనని నిపుణులు చెబుతున్నారు. ద్రవ్యోల్బణం, పెరుగుతున్న జీవన వ్యయం, గృహ నిర్మాణ ఖర్చులు, ప్రభుత్వ వ్యయ కోతలు వంటి ఉమ్మడి సమస్యలపై ప్రజలు రోడ్డెక్కడంతో అనేక దేశాలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా ఫ్రాన్స్, అల్బేనియా దేశాలు ప్రభుత్వ విధానాలపై తీవ్ర ప్రజాగ్రహాన్ని ఎదుర్కొంటున్నాయి. ఆయా దేశాల రాజధాని నగరాల్లో మొదలై కార్చిచ్చులా మిగతా నగరాలకు వ్యాపిస్తున్నాయి. కొన్నిచోట్ల అదుపుతప్పి హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి.
నిధుల కోతపై ఫ్రాన్స్‌లో ఫైర్..
ఫ్రాన్స్‌లో జీవన వ్యయం, ఇంధన ధరల పెరుగుదల, విద్యారంగంలో నిధుల కోతలపై పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. అధ్యక్ష ఎన్నికలకు ముందు దేశంలో నెలకొన్న ద్రవ్యోల్బణంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పారిస్‌తో పాటు దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ నిరసనల్లో పాల్గొనడంతో ఉద్రిక్తత ఏర్పడింది.
ఇంటి అద్దెలపై పోర్చుగల్‌లో..
బెల్జియం, పోర్చుగల్ దేశాలలో కూడా ఇదేపరిస్థితి కనిపిస్తోంది. బెల్జియంలో విద్యారుసుములు, జీవన వ్యయ భారాలపై విద్యార్థులు ఆందోళనలు చేపట్టగా, పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. పోర్చుగల్ రాజధాని లిస్బన్లో వేలాది మంది ప్రజలు తక్కువ వేతనాలు, విపరీతంగా పెరిగిన ఇరవైన అద్దెలు, గృహ నిర్మాణ సమస్యలపై భారీ ప్రదర్శనలు నిర్వహించారు.
ఆర్థిక ఒత్తిడితో ఇటలీలో..
ఇటలీ, తుర్కియే, అర్జెంటీనా దేశాలలో కూడా ఆర్థిక ఇబ్బందులపై నిరసనలు వెల్లువెత్తాయి. ఇటలీలో పెరుగుతున్న ధరలపై ప్రజలు గళం విప్పగా, తుర్కియేలో పెన్షనర్లు తమ ప్రాథమిక హక్కుల కోసం ఆందోళన చేపట్టారు. అర్జెంటీనాలో ఉన్నత విద్య కోసం కేటాయించే బడ్జెట్ కోతలపై విద్యార్థులు, కార్మికులు రాజధాని బ్యూనస్ ఎయిర్స్లో నిరసన తెలిపారు. కాగా, భారతదేశంలో ఓటరు జాబితాల సవరణలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ విపక్షాలు, ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతున్నాయి.
అమెరికాలో ‘నో కింగ్స్’
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను వ్యతిరేకిస్తున్న ‘నో కింగ్స్’ నెట్వర్క్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా వివిధ నగరాలు, ప్రాంతాలలో భారీ ర్యాలీలు జరిగాయి. మిడ్ టర్మ్ ఎన్నికలలో ప్రజలు పెద్ద ఎత్తున ముందస్తు ఓటింగ్ వేసేలా ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ ర్యాలీలు చేపట్టారు. ఈ కార్యక్రమాలతో ఏ రాజకీయ పార్టీకీ సంబంధంలేదని పేర్కొన్నప్పటికీ, ట్రంప్ పాలనపట్ల అసంతృప్తిగా ఉన్న ప్రజలతో గత రెండేళ్లుగా ‘నో కింగ్స్’ నిర్వహిస్తున్న ప్రదర్శనలు, మార్చ్‌లకు ఇది కొనసాగింపుగానేనని స్పష్టమవుతోంది. ఈ పరిణామాలన్నీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక, రాజకీయ అసంతృప్తిని స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయి.
