- పలుచోట్ల హింసాత్మకంగా మారిన నిరసనలు
- ఫ్రాన్స్‌లో వెయ్యి మందికి పైగా అరెస్టు
- ఇటలీలో టియర్ గ్యాస్ ప్రయోగం
పారిస్/ మిలాన్/ మాడ్రిడ్: యూరప్‌లో పెరుగుతున్న జీవన వ్యయం, ప్రభుత్వ విధానాలు, పెన్షన్లు, గృహ వసతి, విద్యా రంగానికి వ్యతిరేకంగా ఫ్రాన్స్, అల్బేనియా, ఇటలీ, స్పెయిన్, పోర్చుగల్ తదితర దేశాల్లో భారీ నిరసనలు వెల్లువెత్తాయి. కొన్ని ప్రాంతాల్లో ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వీకెండ్ కావడంతో లక్షలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. పెరుగుతున్న జీవన వ్యయం, ఇళ్ల ధరలు ఆకాశాన్ని తాకడం, పెన్షన్లు, విద్యారంగ సమస్యలపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆయా దేశాలలోని ప్రజా సమస్యలపై వేర్వేరుగా ఈ ఆందోళనలు జరుగుతున్నాయి.
ఫ్రాన్స్‌లో ఉద్రిక్తత..
ఫ్రాన్స్‌లో నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. దేశవ్యాప్తంగా జరిగిన ఆందోళనల్లో దాదాపు 4 లక్షల మందికి పైగా ప్రజలు పాల్గొన్నట్లు అంచనా. ఆందోళనకారులను కట్టడి చేయడానికి ప్రభుత్వం సుమారు 70 వేల మందికి పైగా పోలీసులను వివిధ నగరాలలో మోహరించింది. కొన్నిచోట్ల ఆందోళనకారులు, పోలీసుల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ముఖాలకు ముసుగులు ధరించిన కొందరు దుండగులు పోలీసులపై రాళ్లు, గాజు సీసాలు విసిరారు. దీంతో పోలీసులు భాష్పవాయువు, వాటర్ క్యానాన్లు, స్టన్ గ్రనేడ్లను ప్రయోగించి గుంపును చెదరగొట్టారు. ఈ హింసాత్మక ఘటనల్లో సుమారు 1,000 మందిని పోలీసులు అరెస్టు చేసినట్లు ఫ్రాన్స్ మినిస్టర్ లోరెంట్ నున్జ్ తెలిపారు.
మిలాన్‌లో బలగాల మోహరింపు
ఇటలీలోనూ పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. గత వారం జరిగిన హింసాత్మక ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. మిలాన్ సిటీలో అదనపు సైనికులను, పోలీసులను అధికారులు మోహరించారు. రోమ్, టూరిన్ తదితర నగరాల్లో నిరసనకారులపైకి పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు. దేశవ్యాప్తంగా 9 మందిని అరెస్టు చేయగా, మరో 370 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
స్పెయిన్, పోర్చుగల్, అల్బేనియాలలో..
ప్రభుత్వ పెన్షన్లకు బలమైన రక్షణ కల్పించాలనే డిమాండ్‌తో పాటు విపరీతంగా పెరిగిన ఇళ్ల అద్దెలు, గృహ వసతి కొరతపై నిరసనగా స్పెయిన్ ప్రజలు రోడ్డెక్కారు. రాజధాని మాడ్రిడ్ నగరంలో టెంట్లు వేసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. సామాన్యులకు అందుబాటు ధరల్లో ఇళ్ల నిర్మాణం, గృహ వసతి కల్పించాలనే డిమాండ్‌తో పోర్చుగల్‌లో ప్రజలు ప్రదర్శనలు నిర్వహించారు. అల్బేనియాలో పాలనాతీరు, ప్రజా సమస్యలపై జనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ రాజధాని తిరానా సిటీలో వేలాది మంది ప్రజలు గుమిగూడి ప్రభుత్వ వ్యతిరేక నిరసన ప్రదర్శన నిర్వహించారు.
