పండుగ పూట విషాదం.. వనస్థలిపురంలో భార్యాభర్త బైక్పై ఇద్దరు పిల్లలతో వెళ్తుండగా..

పండుగ పూట విషాదం.. వనస్థలిపురంలో భార్యాభర్త బైక్పై ఇద్దరు పిల్లలతో వెళ్తుండగా..

హైదరాబాద్: వనస్థలిపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఆటోనగర్ హైకోర్ట్ కాలనీ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. హయత్‌నగర్‌ రంగనాయకుల గుట్టకు చెందిన వంశీ, వాణి దంపతులు తమ ఇద్దరు పిల్లలతో బైక్‌పై ఎల్బీనగర్‌ వైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో.. బలంగా ఢీకొట్టడంతో గాల్లోకి ఎగిరి ఇద్దరు చిన్నారులు రోడ్డుపై పడిపోయారు. మాన్విష్‌ (2), యుగ్విష్‌ (1)కు తీవ్ర గాయాలయ్యాయి.

చిన్నారుల తలకు గాయాలు.. చెవుల నుంచి రక్తస్రావం అయింది. నితిన్ అనే బీటెక్‌ విద్యార్థి  కారు నడిపినట్లు స్థానికులు తెలిపారు. కారులో నితిన్‌తో పాటు మరో ఇద్దరు స్నేహితులు కూడా ఉన్నారు. ప్రమాదంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌ అయింది. వనస్థలిపురం పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. చిన్నారుల ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలియాల్సి ఉంది.

చాదర్‌ఘాట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సైదాబాద్‌ స్టీల్‌ బ్రిడ్జిపై ప్రయాణిస్తున్న స్కూటీని ఆటో ఢీ కొట్టింది. ఈ ఘటనలో.. స్కూటీ నడుపుతున్న నరసింహ అనే వ్యక్తి మృతి చెందాడు. మరో వ్యక్తి రాకేష్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం జరిగిన వెంటనే ఆటో డ్రైవర్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.