రెండో టెస్ట్​లో రోహిత్ ఆడటంపై రాహుల్​ వ్యాఖ్య

రెండో టెస్ట్​లో రోహిత్ ఆడటంపై రాహుల్​ వ్యాఖ్య

చట్టోగ్రామ్:  బంగ్లాదేశ్​తో రెండో టెస్ట్​కు రోహిత్​ శర్మ అందుబాటులో ఉండే విషయం ఒకటి, రెండు రోజుల్లో తెలుస్తుందని టీమిండియా తాత్కాలిక కెప్టెన్​ కేఎల్​ రాహుల్ అన్నాడు. అతని ఫిట్​నెస్​పై తనకు ఎలాంటి సమాచారం లేదన్నాడు. ఎడమ బొటన వేలి గాయంతో రోహిత్​ తొలి టెస్ట్​కు దూరమైన సంగతి తెలిసిందే. టీమ్​ సమష్టిగా రాణించడం వల్లే తొలి టెస్ట్​లో విజయం దక్కిందని రాహుల్​ చెప్పాడు. ‘మాకు అన్ని కలిసొచ్చాయి. బ్యాటింగ్​ బాగా చేశాం. బౌలింగ్​ బాగా వేశాం. ఫీల్డింగ్​లోనూ ఎక్కువ క్యాచ్​లే తీసుకున్నాం. వీటివల్లే మేం మ్యాచ్​ గెలవగలిగాం. ఒకరిద్దరితో మ్యాచ్​లను గెలవలేం. కుల్దీప్​, సిరాజ్​ తొలి ఇన్నింగ్స్​లో బౌలింగ్​ బాగా చేశారు. మిగతా వాళ్లు సపోర్ట్​గా నిలిచారు. ఓ టీమ్​గా ఎలా ఆడాలో అందరూ అలాగే ఆడారు’ అని రాహుల్​ పేర్కొన్నాడు.

సెకండ్​ టెస్ట్​కు నాసుమ్​ అహ్మద్​

రెండో టెస్ట్​ కోసం బంగ్లాదేశ్​ టీమ్​లో ఒక మార్పు చోటు చేసుకుంది. గాయపడిన పేసర్​ ఎబాదత్​ హుస్సేన్​ ప్లేస్​లో అన్​క్యాప్డ్​​ లెఫ్టార్మ్​ స్పిన్నర్​ నాసుమ్​ అహ్మద్​ను టీమ్​లోకి తీసుకున్నారు. నాసుమ్​ బంగ్లా తరఫున 4 వన్డేలు, 28 టీ20లు ఆడాడు.