కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్‌కు హాలీవుడ్ ప్రశంసలు.. మైఖేల్ జాక్సన్ గురువు ఏమన్నారంటే?

కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్‌కు హాలీవుడ్ ప్రశంసలు.. మైఖేల్ జాక్సన్ గురువు ఏమన్నారంటే?

భారతీయ సినీ పరిశ్రమ గర్వించదగ్గ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఖాతాలో మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం వచ్చి చేరింది. 'ఆర్ఆర్ఆర్' చిత్రంలోని 'నాటు నాటు' పాటకు ప్రపంచాన్ని ఉర్రూతలూగించి ఆస్కార్ సాధించిన ఆయన ప్రతిభకు.. ఇప్పుడు సాక్షాత్తూ 'కింగ్ ఆఫ్ పాప్' మైఖేల్ జాక్సన్ గురువే ఫిదా అయ్యారు.

మైఖేల్ జాక్సన్ ఐకానిక్ స్టెప్స్ వెనుక ఉన్న లెజెండరీ కొరియోగ్రాఫర్ విన్సెంట్ ప్యాటర్సన్ (Vincent Paterson), ప్రేమ్ రక్షిత్ (Prem Rakshith) టాలెంట్‌ను ప్రశంసించడం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యింది.

విన్సెంట్ ప్యాటర్సన్ అంటే సామాన్యమైన వ్యక్తి కాదు.. మైఖేల్ జాక్సన్, మడోన్నా వంటి గ్లోబల్ సూపర్ స్టార్ల కెరీర్‌ను మలుపు తిప్పిన డైరెక్టర్ అండ్ కొరియోగ్రాఫర్ కూడా. లేటెస్ట్ గా ఆయన ప్రేమ్ రక్షిత్ కోసం ఒక ప్రత్యేక వీడియో సందేశాన్ని పంపారు.

"హలో ప్రేమ్.. మీ కొరియోగ్రఫీ అద్భుతం, నేను మిమ్మల్ని నిజంగా అభినందిస్తున్నాను. మీరు ఆస్కార్ సభ్యుడిగా ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఏదో ఒక రోజు మిమ్మల్ని తప్పకుండా కలుస్తాను" అంటూ విన్సెంట్ పేర్కొనడం భారతీయ నృత్య ప్రతిభకు దక్కిన గ్లోబల్ సర్టిఫికేట్ అని చెప్పాలి.

ఈ ప్రశంసలపై ప్రేమ్ రక్షిత్ కూడా స్పందించారు. చిన్నప్పటి నుండి నేను మైఖేల్ జాక్సన్ 'స్మూత్ క్రిమినల్' పాటకు పెద్ద అభిమానిని. అలాంటి పాటను కంపోజ్ చేసిన విన్సెంట్ సర్ నుండి ప్రశంసలు అందుకోవడం నా జీవితంలో మర్చిపోలేని అనుభూతి అంటూ తన సంతోషాన్ని పంచుకున్నారు.

చెన్నైలో సాదాసీదాగా మొదలైన ప్రేమ్ రక్షిత్ ప్రస్థానం.. ఇవాళ హాలీవుడ్ దిగ్గజాలు మెచ్చే స్థాయికి చేరింది. 'ఛత్రపతి' నుంచి 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' వరకు ఆయన సృష్టించిన ప్రతి సిగ్నేచర్ స్టెప్ ఒక చరిత్రేనని చెప్పుకోవచ్చు.

తెలుగు, తమిళ భాషల్లో దాదాపు 200 చిత్రాలకు పనిచేసిన రక్షిత్ మాస్టర్ మంచి గుర్తింపు పొందారు. ఒకప్పుడు మైఖేల్ జాక్సన్ స్టెప్స్ చూసి ఇన్ స్పైర్ అయిన రక్షిత్, నేడు అదే జాక్సన్ కొరియోగ్రాఫర్ చేత శభాష్ అనిపించుకోవడం నిజంగా 'నాటు నాటు' రేంజ్ సక్సెస్ అని చెప్పాలి