తమిళనాడులో భారీగా మత్తుపదార్థాలు పట్టుబడటం కలకలం రేపింది. తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీకి చెందిన జిల్లా కార్యవర్గ సభ్యుడు భూపాలన్ ఇంట్లో సుమారు 100 కోట్ల రూపాయల విలువైన మత్తుపదార్థాలను కేంద్ర రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి.
నిషేధిత మెథాంఫెటమైన్ మాదకద్రవ్యాల అక్రమ రవాణా, నిల్వలకు సంబంధించి అందిన సమాచారంతో ఢిల్లీ నుంచి వచ్చిన అధికారులు భూపాలన్ నివాసంతో పాటు ఆయన స్నేహితుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సుమారు 135 కిలోల మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. వీటి విలువ దాదాపు 100 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఈ కేసులో టీవీకే నేత భూపాలన్తో పాటు ఆయన స్నేహితుడు సుగన్ను అధికారులు అరెస్ట్ చేశారు.
టీవీకే బ్రేకింగ్ బ్యాడ్ పార్టీ: స్టాలిన్
టీవీకే నేత ఇంట్లో డ్రగ్స్ పట్టుబడటంపై డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ఫైరయ్యారు. సీఎం విజయ్ ని టార్గెట్ చేస్తూ వీడియో రిలీజ్ చేశారు. పార్టీలో డ్రగ్ మాపియా పేట్రేగిపోతుంటే.. సీఎం విజయ్ మాత్రం రాష్ట్రం అంతా తిరుగుతూ నీతులు చెబుతారు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
కేవలం ఐదు నెలల్లోనే టీవీకే బ్యాడ్ పార్టీ నుంచి బ్రేకింగ్ బ్యాడ్ పార్టీగా అవతరించిందని విమర్శించారు. పంచ్ డైలాగ్స్ కొట్టడం కాదు.. డ్రగ్స్ రాకెట్ ను నిర్మూలించాలని డిమాండ్ చేశారు.
ఈ ఘటనను రాజకీయ నాటకాలకు అతీతంగా చూడాలని దర్యాప్తు సంస్థలను కోరారు స్టాలిన్. విజయ్ నటించిన లియో సినిమాను కోట్ చేస్తూ.. టీవీకేలో ఇంకా ఎంత మంది లియో దాస్ లు ఉన్నారో గుర్తించాలని కోరారు.
