సద్దుల సంబురం..పద్మాక్షి, ఉర్సుగుట్టలు, కోమటి చెరువు వద్ద అంగరంగ వైభవంగా వేడుకలు

సద్దుల సంబురం..పద్మాక్షి, ఉర్సుగుట్టలు, కోమటి చెరువు వద్ద అంగరంగ వైభవంగా వేడుకలు
  • తరలివచ్చిన లక్షలాది మంది మహిళలు.. 
  • ఉత్సాహంగా ఆడిపాడిన ప్రముఖులు 

నెట్​ వర్క్, వెలుగు :  తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీక అయిన సద్దుల బతుకమ్మ పండుగ సంబరాలు రాష్ట్రవ్యాప్తంగా అంబరాన్నంటాయి. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, మెదక్ జిల్లాలతో పాటు వివిధ ప్రాంతాల్లో వేడుకలు అత్యంత వైభవంగా సాగాయి. 

గ్రేటర్ వరంగల్ పరిధిలోని పద్మాక్షి గుట్ట, ఉర్సుగుట్టలతో పాటు కోమటి చెరువు, ఎల్లమ్మ చెరువుల వద్దకు లక్షలాది మంది మహిళలు, చిన్నారులు సంప్రదాయ చీరకట్టులో తరలివచ్చి వీ6 పాటలకు అనుగుణంగా బతుకమ్మలు ఆడి, వాయినాలు ఇచ్చుకుని భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేశారు.  ఉర్సుగుట్ట వద్ద మాజీ మంత్రి కొండా సురేఖ మహిళలతో కలిసి బతుకమ్మ  ఆడారు.  

ఉర్సుగుట్ట వద్ద చిన్నారుల భద్రతకు రిస్ట్ బ్యాండ్లు ఏర్పాటు చేయడం, వర్ధన్నపేటలో అమెరికా మహిళ బతుకమ్మ ఆడటం, సంగారెడ్డిలో 8 టన్నుల పూలతో 32 అడుగుల భారీ బతుకమ్మ రూపకల్పన విశేషంగా ఆకట్టుకున్నాయి.

 హుస్నాబాద్‌‌లో మంత్రి పొన్నం ప్రభాకర్, కోడిమ్యాలలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, టేకులపల్లిలో ఎమ్మెల్యే కోరం కనకయ్య వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. పల్లెలు, పట్టణాల్లో ఎలాంటి ఆటంకాలు జరుగకుండా పోలీసుల పటిష్ట బందోబస్తు మధ్య బతుకమ్మ సంబరాలు ప్రశాంతంగా ముగిశాయి.