ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సద్దుల సంబురం..నిమజ్జనానికి ముస్తాబైన చెరువులు, ప్రత్యేక ఘాట్లు 

ఇవాళ  రాష్ట్ర వ్యాప్తంగా సద్దుల సంబురం..నిమజ్జనానికి ముస్తాబైన చెరువులు, ప్రత్యేక ఘాట్లు 
  • నేడు సద్దుల సంబురం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద బతుకమ్మకు ఘనంగా ఏర్పాట్లు 
  • నిమజ్జనానికి ముస్తాబైన చెరువులు, ప్రత్యేక ఘాట్లు 
  •  హైదరాబాద్​ ట్యాంక్‌‌‌‌‌‌‌‌బండ్‌‌‌‌‌‌‌‌పై గ్రాండ్‌‌‌‌‌‌‌‌ సెలబ్రేషన్స్‌‌‌‌‌‌‌‌
  • హాజరుకానున్న విజయ్‌‌‌‌‌‌‌‌ దేవరకొండ, రష్మిక 
  • 700 మంది కళాకారులతో ధూంధాం.. లేజర్‌‌‌‌‌‌‌‌ షో
  • ఏర్పాట్లపై మంత్రి జూపల్లి కృష్ణారావు స్పెషల్‌‌‌‌‌‌‌‌ ఫోకస్
  • ప్రజలకు సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌ పండుగ శుభాకాంక్షలు


 హైదరాబాద్, వెలుగు: ‘ఒక్కేసి పువ్వేసి చందమామా’ అంటూ ఆడబిడ్డల కోలాటాలు, ప్రకృతి పరవళ్ల నడుమ సాగిన తెలంగాణ ఆత్మగౌరవ పూల పండుగ తుది అంకానికి చేరింది. పల్లె, పట్నం అనే తేడా లేకుండా ఊరూవాడా పూల వనాలై విరబూస్తున్నాయి. ఎంగిలిపూల బతుకమ్మతో మొదలైన ఆడబిడ్డల సంబురం.. ఆదివారం జరిగే సద్దుల బతుకమ్మతో ముగియనుంది.

ఈ వేడుకల కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఊరూరా చెరువులు, కుంటలు, నగరాల్లోని ప్రత్యేక ఘాట్లను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసింది. చివరిరోజు ఆడపడుచులు బతుకమ్మలను తీరొక్క పూలతో పేర్చి ఆడిపాడి సందడి చేసేందుకు రెడీ అయ్యారు. రాష్ట్ర సంస్కృతీ, సంప్రదాయాల వైభవాన్ని విశ్వవ్యాప్తంగా చాటిచెప్పేలా హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ట్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై సర్కారు ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ సంబురాలను వైభవంగా నిర్వహించనున్నారు. ఆదివారం సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ వేడుకలు కనులపండువగా సాగనున్నాయి. ట్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిసరాలను రంగురంగుల విద్యుద్దీపాలు, స్వాగత తోరణాలతో  శోభాయమానంగా తీర్చిదిద్దారు. 

సందడి చేయనున్న సినీతారలు

ఈ సారి ట్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బతుకమ్మ సంబురాల్లో సినీ తారలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. యువ కథానాయకుడు విజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దేవరకొండ, ప్రముఖ నటి రష్మిక మందన దంపతులు వేడుకల్లో పాల్గొని సందడి చేయనున్నారు. వీరితోపాటు హుస్సేన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సాగర్ అలలపై కనువిందు చేసేలా ప్రత్యేక లేజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షో ఏర్పాటు చేశారు. జానపద, సాంస్కృతిక కళారూపాలను ప్రతిబింబించేలా రాష్ట్రవ్యాప్తంగా తరలొచ్చిన 700 మంది కళాకారులతో సాంస్కృతిక ధూంధాం నిర్వహించనున్నారు. ఈ వేడుకలపై పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రత్యేక దృష్టి సారించారు. ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు రాకుండా స్వయంగా పర్యవేక్షించారు. జీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీ, పోలీస్, పర్యాటక, సాంస్కృతిక, విద్యుత్, అగ్నిమాపక శాఖల అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, పారిశుధ్యంపై ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. నగర నలుమూలల నుంచి తరలొచ్చే మహిళలకు తాగునీరు, ప్రత్యేక ఘాట్లు, లైటింగ్, మొబైల్ బయో- టాయిలెట్లులాంటి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేలా ఏర్పాట్లను స్వయంగా సమీక్షించారు. 

మార్కెట్లలో పూల సందడి

సద్దుల బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మార్కెట్లు జనంతో కిటకిటలాడుతున్నాయి. గునుగు, తంగేడు, గుమ్మడి, పట్టుకుచ్చులతోపాటు బంతి, చేమంతి, గులాబీ, తామర పూల కొనుగోళ్లతో మార్కెట్లు కిక్కిరిసిపోయాయి. శనివారం అర్ధరాత్రి దాకా సాగిన విక్రయాలు.. ఆదివారం తెల్లవారుజాము నుంచే మరింత ఊపందుకున్నాయి. ఆడబిడ్డలంతా సద్దుల సంబురంలో మునిగితేలేందుకు సర్వసన్నద్ధమయ్యారు.

ట్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై మహా సంబురం: జూపల్లి 

తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలు, ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ వేడుకలను ట్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రజలందరికీ ఆహ్వానం పలికారు. నగరం నలుమూలల నుంచి వచ్చే మహిళలు బతుకమ్మలు ఆడేందుకు, నిమజ్జనం చేసేందుకు వీలుగా ప్రత్యేక ఘాట్లు, విద్యుద్దీపాలంకరణ, 
రవాణా, పటిష్ట భద్రతా చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు.  

వీణా వాణీలతో బతుకమ్మ ఆడిన సీతక్క

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లోని మధురానగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో ఉన్న మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. మంత్రి సీతక్కతో పాటు బాలల హక్కుల కమిషన్ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్ సీతా దయాకర్ రెడ్డి, కమిషన్ సభ్యులు, శాఖ అధికారులు, సిబ్బంది బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అవిభక్త కవలలు వీణా–వాణీలను మంత్రి సీతక్క ఆప్యాయంగా పలకరించి, వారితో బతుకమ్మ ఆడారు. 

ప్రతి ఇంటా ఆనందాల పూలవాన కురవాలి: రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి

తెలంగాణ సాంస్కృతిక వైభవానికి, ప్రకృతి ఆరాధనకు నిలువెత్తు నిదర్శనం బతుకమ్మ పండుగ అని సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి పేర్కొన్నారు. సద్దుల బతుకమ్మ పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ఆడబిడ్డలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలు విశ్వవ్యాప్తంగా వెలుగొందేలా రాష్ట్రమంతటా పండుగను వైభవంగా నిర్వహించుకోవడం హర్షణీయమన్నారు. ప్రకృతిని, తీరొక్క పూలను పూజించే అపురూప సంస్కృతి ఒక్క తెలంగాణకే సొంతమన్నారు. ఈ పూల పండుగ ప్రతి ఇంటా ఆనందాల పూలవాన కురిపించాలని ఆకాంక్షించారు.