టాలీవుడ్‌లో చిన్న సినిమాల కాన్ఫిడెన్స్ రోజురోజుకూ పెరుగుతోంది. కథపై నమ్మకంతో భారీ సినిమాల మధ్యలోనూ తమ చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ వెనుకాడటం లేదు. ఇప్పుడు అదే ధైర్యంతో వస్తున్న చిత్రం 'సహ: లైఫ్ ఆఫ్ సంజు'. శివ కుమార్ కాసారం, శ్వేతా లక్ష్మణ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు నిశాంత్ దోటి దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 4న థియేటర్లలోకి రానున్న ఈ మూవీ ట్రైలర్‌ను లేటెస్ట్ గా రిలీజ్ చేశారు.
ఈ ట్రైలర్ విడుదల సందర్భంగా హీరో, హీరోయిన్ శ్వేతా లక్ష్మణ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. సినిమా కంటెంట్‌పై ఆమె ఏకంగా ఛాలెంజ్ చేయడం అందరి దృష్టినీ ఆకర్షించింది. 'సహ సినిమా చూసి ఎవరికైనా నచ్చకపోతే.. అమీర్‌పేట్ సెంటర్‌లో నిలబడి గుండు కొట్టించుకుంటా' అంటూ సవాల్ చేశారు. నా మాట గుర్తుపెట్టుకోండి అంటూ.. శ్వేత చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.
ప్రేమ, బాధ, త్యాగం, జీవితాన్ని మార్చేసే నిర్ణయాల చుట్టూ కథ సాగుతుందని ఆమె తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలోనూ 'సహ'కు కనెక్ట్ అయ్యే ఎమోషన్ ఉంటుందని, ప్రేక్షకులు సినిమాతో తప్పకుండా రిలేట్ అవుతారని ధీమా వ్యక్తం చేశారు. తాము కేవలం సినిమా ప్రమోషన్ కోసం మాట్లాడటం లేదని.. కంటెంట్‌పై పూర్తి నమ్మకంతోనే ఇలాంటి ఛాలెంజ్ చేస్తున్నామని ఆమె చెప్పుకొచ్చారు. ఈ సినిమా చూశాక ఎంత మంచి సినిమా తీశారు అని అందరూ మెచ్చుకుంటారని అన్నారు..
మరోవైపు హీరో శివ కుమార్ కాసారం కూడా అదే స్థాయిలో కాన్ఫిడెన్స్ చూపించారు. సినిమా అంచనాలను అందుకోకపోతే తనకు ఫోన్ చేసి తిట్టొచ్చంటూ ఏకంగా తన ఫోన్ నంబర్‌ను బహిరంగంగా చెప్పేశారు. పెద్ద సినిమాల మధ్య సెప్టెంబర్ 4న విడుదల చేయొద్దని చాలామంది సూచించినప్పటికీ.. ప్రేక్షకుల ముందే తమ సినిమాకు సత్తా ఏంటో నిరూపించుకోవాలనే ఉద్దేశంతో విడుదల తేదీని ఖరారు చేశామని ఆయన తెలిపారు.
ప్రముఖ నిర్మాతలు బన్నీ వాసు, వంశీ నందిపాటి ఈ సినిమాను విడుదల చేస్తుండటంతో టాలీవుడ్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి. రి హీరోయిన్ చేసిన ఈ భారీ ఛాలెంజ్‌ను 'సహ'నిలబెట్టుకుంటుందా? శివ కుమార్ చెబుతున్నట్టుగా పెద్ద సినిమాల మధ్య చిన్న సినిమా సత్తా చాటుతుందా? సెప్టెంబర్ 4న దీనికి సమాధానం దొరకనుంది...
