మేడారం బైలెల్లిన పెండ్లికొడుకు

మేడారం బైలెల్లిన పెండ్లికొడుకు

కొత్తగూడ / గుండాల, వెలుగు: సమ్మక్క భర్త పగిడిద్దరాజు సోమవారం పెండ్లి కొడుకుగా ముస్తాబై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వేపలగడ్డ నుంచి మేడారం బైలెల్లిండు. మహబూబాబాద్​ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లకు మంగళవారం చేరుకుంటాడు. అక్కడ పగిడిద్దరాజు గుడిలో ప్రత్యేక పూజలు చేస్తారు. తళపతి బుచ్చిరాములు ఇంటి నుంచి పానుపు(పసుపు, కుంకుమ)ను డోలు వాయిద్యాల నడుమ గుడికి చేర్చి రహస్య పూజలు  చేస్తారు. తర్వాత పగిడిద్దరాజును పెండ్లి కొడుకుగా పడిగె ఆకారంలో వెదురు కర్రకు అలంకరిస్తారు. తర్వాత శివసత్తుల పూనకాలతో దేవుని గుట్ట మీదుగా కాలి నడకన మేడారం బయలెల్లుతారు. పూనుగొండ్ల నుంచి కర్లపల్లి మీదుగా పస్రా దగ్గర్లోని లక్ష్మీపురంలో పెనుక వంశస్తుల ఇంటిలో బస చేసి బుధవారం సాయంత్రం వరకు మేడారం చేరుకుంటారు.అక్కడికి పగిడిద్దరాజు చేరుకున్నాక సమ్మక్క పూజారులు ఎదుర్కోళ్ళు నిర్వహించి గద్దెపైకి చేర్చడంతో మహా జాతర ప్రారంభమవుతుంది. తర్వాత కొండాయి నుంచి గోవిందా రాజులు, కన్నెపల్లి నుంచి సారలమ్మ  వస్తారు. కాగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం వేపలగడ్డలోని పగిడిద్దరాజు గుడిలో సోమవారం అరెం వంశీయులు ప్రత్యేక పూజలు చేసి కాలినడకన మేడారం బయలుదేరారు. వీరు మంగళవారం ములుగు జిల్లా లక్ష్మీపురం, అక్కడినుంచి పూనుగొండ్ల చేరుకుంటారు. పెనక వంశీయులతో కలిసి బుధవారం రాత్రికి మేడారం చేరుకుంటారు. జాతర ముగిశాక అరెం వంశీయులు పగిడిద్దరాజును గుండాలకు తీసుకువచ్చి గర్భగుడిలో ఉంచుతారు. మేడారం జాతర ముగిసిన16 రోజుల తర్వాత వేపలగడ్డంలో జాతర చేస్తారు.