ములుగు/ గజ్వేల్/ కంగ్టి/నారాయణఖేడ్, వెలుగు: దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడుకోవడంతో పాటు ప్రతి పౌరుడి ఓటు హక్కును పరిరక్షించాల్సిన అవసరం ఉందని ఏఐసీసీ అధికార ప్రతినిధి సరళ్ పటేల్ అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నగరి ప్రీతం, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు తూంకుంట ఆంక్షారెడ్డితో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. అనంతరం నారాయణఖేడ్‌లో జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఓటు బచావో-దేశ్ బచావో’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1951లో కాంగ్రెస్ ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించేందుకు కృషి చేసిందని గుర్తుచేశారు.
అయితే, బీజేపీ ప్రభుత్వం తమకు అనుకూలమైన ఓట్లను ఉంచుతూ, వ్యతిరేక ఓట్లను తొలగించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా 13 కోట్ల మంది ఓటర్లను తొలగించారని, తెలంగాణలో 92 లక్షల మందికి నోటీసులు ఇచ్చి 73 లక్షల ఓట్ల తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ వల్ల ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని, దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. బీజేపీ కుల, మత, ప్రాంతాల పేరుతో ప్రజలను విభజిస్తోందని, బీజేపీ, బీఆర్ఎస్ చీకటి ఒప్పందాలతో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయని ఆరోపించారు.
ఓటు హక్కు పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ చేపడుతున్న ఉద్యమానికి ప్రజలు మద్దతు ఇవ్వాలని, నవంబర్ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో జరిగే కాంగ్రెస్ నిరసన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. కార్యక్రమాల్లో నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, డీసీసీబీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ నగరి ప్రీతం, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
