కోల్బెల్ట్, వెలుగు: రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సతీమణి, విశాఖ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ సరోజ వివేక్ సోమవారం మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేట, లంబడిపల్లి గ్రామాల్లో పర్యటించారు. దసరా వేడుకల్లో భాగంగా మహిళలు, చిన్నారులతో కలిసి సద్దుల బతుకమ్మ ఆడారు. వీ6 బతుకమ్మ పాటకు గ్రామస్తులతో కలిసి ఆడిపాడి సందడి చేశారు.
అనంతరం దుర్గామాత, హనుమాన్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు ఆమెకు తీర్థప్రసాదాలు అందజేసి, శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా సరోజ వివేక్ మాట్లాడుతూ అమ్మవారి దయతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని దేవుళ్లను కోరుకున్నట్లు తెలిపారు.
ఆమెవెంట కాంగ్రెస్ జిల్లా సెక్రటరీ మెరుగు చైతన్య, సీనియర్ లీడర్లు మల్లమ్మ, బొడ్డు సుగుణ, గోల్కొండ కవిత, జనగామ సుమలత, పిల్లి మల్లేశ్వరి, శారద తదితరులు పాల్గొన్నారు.
