
నాన్నకు ఎప్పుడైనా ఐ లవ్ యూ చెప్పారా..?’‘నాన్నకా..? అమ్మకైతే అప్పుడప్పుడు చెప్తాం. చెప్పాలనిపిస్తుంది. ఇక ఫ్రెండ్స్, లవర్స్ మధ్య లవ్ యూ చెప్పుకోవడం చాలా కామన్. కానీ, నాన్నకెలా చెప్తాం?’ అంటారా.. ‘ఎందుకు చెప్పకూడదు? అమ్మలానే నాన్న కూడా మీ జీవితంలో చాలా ఇంపార్టెంట్ పర్సన్ కదా’. అయినా కూడా ఏమో.. ఎప్పుడూ చెప్పలేదు. చెప్తే ఆయన రెస్పాన్స్ ఎలా ఉంటుందో కూడా తెలియదు’ అంటారా.. ‘అయితే ఒక్కసారి చెప్పి చూడండి’. చిన్నప్పుడు ముద్దుముద్దు మాటలతో పిలిచే ‘నాన్న’అనే పిలుపు కోసం ఎదురుచూసిన నాన్న..
పెద్దయ్యాక.. ఆయన ఎదురుచూసేది ఈ మాట కోసమే. మొదటిసారి నాన్న అని పిలిచిన రోజు ఎంత స్పెషలో.. మీరు మనసారా హత్తుకుని ఐ లవ్ యూ చెప్పిన రోజూ ఆయనకు అంతే స్పెషల్. అలాంటి మధురక్షణాలను అనుభూతి చెందడానికి ఇది సరైన రోజు. ‘హ్యాపీ ఫాదర్స్ డే’ అంటూమనసు విప్పి మాట్లాడేయండి. ఎందుకంటే...
నాన్న.. అనే పిలుపు కోసం పెండ్లయిన ప్రతి మగాడు ఎదురుచూస్తుంటాడు. ఒక్కసారి తను త్వరలో తండ్రి కాబోతున్నాడనే విషయం తెలిసిన క్షణం తన కళ్లలో కనిపించే ఆనందం మాటల్లో వర్ణించలేనిది. అప్పటి నుంచి సరదాగా అందరూ ‘నాన్న.. నాన్న..’ అంటూ పుట్టబోయే బిడ్డ గురించి మాట్లాడుతుంటే మురిసిపోతాడు కాబోయే నాన్న. మొదటిసారి బిడ్డను చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఓ అద్భుతాన్ని చూసినట్టు కళ్లలో మెరుపు కనిపిస్తుంది. మనసులో పొంగుకొస్తున్న పట్టరాని ఆనందం.. ఆ ఉద్వేగాన్ని మాటల్లో చెప్పలేక కళ్లు చెమ్మగిల్లడం.. కన్నబిడ్డను ముద్దాడిన ఆ క్షణం.. ఏమని వర్ణించగలం.
నిశ్చలమైన సముద్రం
తల్లి నవమాసాలు మోసి.. ప్రసవ వేదన అనుభవించి బిడ్డకు జన్మనిస్తుంది. ఆ వేదన, బాధ, ఆ సమయంలో కలిగే ఎన్నో రకాల ఉద్వేగాలు నాన్నలోనూ ఉంటాయి. కానీ.. అవేవీ పైకి కనపడనివ్వకుండా నిశ్చలమైన సముద్రంలా పైకి గంభీరంగా, ప్రశాంతంగా కనిపిస్తాడు. బిడ్డ పుట్టిన మొదటి రోజుతల్లి ఎలాగైతే పాలివ్వడం అనే కొత్త బాధ్యత నిర్వర్తిస్తుందో.. అలాగే నాన్న కూడా తనకు తెలియకుండానే వాళ్లిద్దరి బాగోగులు చూసుకోవడంలో మునిగిపోతాడు.
కొత్తగా తల్లి అయిన ఆమెకి బిడ్డ ఒక్కరే.. కానీ, తండ్రికి బిడ్డతోపాటు తన భార్య కూడా బిడ్డే.. ఆమె తిరిగి కోలుకునేవరకు. ఎప్పుడెప్పుడు తన ముద్దుల చిన్నారి పిలిచే ‘నాన్నా..’ అనే పిలుపు తన చెవిన పడుతుందా? అని ఆత్రుతగా ఎదురుచూస్తుంటాడు. తన జీవితకాలంలో సాధించిన విజయాల కంటే తండ్రిగా తాను గెలిచిన క్షణాలనే ఎక్కువ గుర్తుపెట్టుకుంటాడు నాన్న. తన పిల్లల విషయంలో తండ్రి పొందే ఆనందం ఎవరెస్ట్ ఎక్కినంత హాయినిస్తుంది. మనసులో ఇన్ని రకాల భావోద్వేగాలు ఉన్నా.. ఎప్పుడూ బయటికి కనపడనివ్వడు.
తండ్రి మనసు
అన్నీ తానే దగ్గరుండి చూసుకోవాలనే ఆశ. తన పిల్లల్ని గొప్పస్థాయిలో చూడాలనే ఆకాంక్ష. ప్రతి విషయంలో పిల్లలకు బెస్ట్ ఇవ్వాలనే తపన. కన్నబిడ్డ గురించి తనకంటే ఎక్కువ ఎవరికి తెలుస్తుంది అనుకునే నాన్నని చూస్తే.. బొమ్మరిల్లు సినిమాలో ప్రకాశ్ రాజ్ గుర్తొస్తాడు. ప్రతి తండ్రి మనసు ఇలాగే ఉంటుందనడంలో సందేహం లేదు. ఎందుకంటే ప్రతి మగాడు పెండ్లికి ముందు ఏదో సాధించాలని.. తనేంటో నిరూపించుకోవాలని, అంచెలంచెలుగా ఎదగాలని.. అనుకుంటాడు. పెండ్లి అయిన తర్వాత మాత్రం ఏం చేసినా తన బిడ్డల కోసమే అనుకుంటాడు. బిడ్డల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో తన ఎదుగుదలను చూసుకుంటాడు. బిడ్డలంటే నాన్నకు ఇష్టం, బాధ్యత కాదు.. వాళ్లు ఆయనకు ప్రాణం.
బెస్ట్ ఫ్రెండ్
పేదవాడైనా, ఐశ్వర్యవంతుడైనా.. బిడ్డలపై ప్రేమ చూపించడంలో నాన్న నాన్నే. ఆ ప్రేమలో కల్మషం ఉండదు. స్వార్థం ఉండదు. అబద్ధం అసలే ఉండదు. నిజమైన ప్రేమ అనుభూతి చెందాలంటే ఒక్కసారి నాన్నతో మాట్లాడి చూడండి. నాన్న మనసులో నుంచి వచ్చే ప్రతి మాటలోనూ ఆప్యాయత, బాధ్యత, అపారమైన ప్రేమ వర్షంలా కురుస్తుంది. నిజమైన స్నేహం కోసం స్నేహితుల కోసం వెతకనక్కర్లేదు. అమ్మతోనే కాదు.. నాన్నతోనూ ఫ్రెండ్షిప్ చేయండి. నాన్నతో స్నేహం చేస్తే ఎన్ని వింతలు, విశేషాలు, విజ్ఞానం మీ సొంతమవుతాయో ఊహించలేరు. జీవితం గురించి నాన్న నేర్పించే విషయాలు ఎప్పటికీ మర్చిపోలేం.