భూసేకరణ స్పీడప్ చేయాలె.. వచ్చే సమ్మక్క-సారలమ్మ జాతర నాటికి నీరందించాలె 

భూసేకరణ స్పీడప్ చేయాలె.. వచ్చే సమ్మక్క-సారలమ్మ జాతర నాటికి నీరందించాలె 
  • ఐబీ అధికారులకు మంత్రి సీతక్క ఆదేశం

ములుగు ,వెంకటాపూర్, వెలుగు: ములుగు నియోజకవర్గంలో సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. వచ్చే సమ్మక్క-సారలమ్మ జాతర నాటికి సాగునీరు అందించే లక్ష్యంతో పనులు పూర్తి చేయాలని సూచించారు. గురువారం ములుగులోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సాగునీటి పనుల పురోగతి, భూసేకరణ, నిధుల మంజూరుపై చర్చించారు. 

ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ రామప్ప, లక్నవరం సాగునీటి పనులను వేగవంతం చేసి, భూసేకరణలో ఉన్న సమస్యలను త్వరగా పరిష్కరించాలన్నారు. పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని, నిధుల మంజూరుకు సంబంధించి తన ప్రత్యేక విధుల అధికారి, వ్యక్తిగత సహాయకులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.   

కోటి నుంచి ఐదు కోట్ల రూపాయలతో 50 నుంచి 100 ఎకరాలకు నీరందించే పనులను గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. జంపన్నవాగుతోపాటు తాడ్వాయి, లింగాపూర్, కొండపర్తి, కాటాపూర్, మేడారం ప్రాంతాల్లో చిన్న చెక్‌‌‌‌‌‌‌‌డ్యామ్‌‌‌‌‌‌‌‌ల నిర్మాణ అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు. సాగునీటి అవసరాలపై ఇప్పటికే సీఎం దృష్టికి తీసుకెళ్లామని, అవసరమైన నిధుల మంజూరుకు కృషి చేస్తామని తెలిపారు. సమావేశంలో ఇరిగేషన్ శాఖ అధికారులు పాల్గొన్నారు.

బస్‌‌‌‌‌‌‌‌స్టాండ్ పనుల్లో క్వాలిటీ ఉండాలె..

ములుగు జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న మోడల్ బస్‌‌‌‌‌‌‌‌స్టాండ్ పనులను క్వాలిటీ ప్రమాణాలతో త్వరగా పూర్తి చేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి నిర్మాణ పనులను పరిశీలించారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో బస్‌‌‌‌‌‌‌‌స్టాండ్ కీలకమన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్ రేగ కళ్యాణి, పంచాయతీరాజ్ డైరెక్టర్ బైరెడ్డి భగవాన్‌‌‌‌‌‌‌‌రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.