ఆదిలాబాద్ లో పేలుడు పదార్థాల కలకలం..యూపీ నుంచి కరీంనగర్ తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు

ఆదిలాబాద్ లో పేలుడు పదార్థాల కలకలం..యూపీ నుంచి కరీంనగర్ తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు
  • 20 వేల డిటోనేటర్లు, 90 బూస్టర్లు, రెండు వాహనాలు స్వాధీనం
  • ఏడుగురు నిందితుల అరెస్ట్, మరో ఇద్దరిపై కేసు

ఆదిలాబాద్​టౌన్, వెలుగు : ఆదిలాబాద్​ జిల్లా కేంద్రంలో రూ.20 లక్షల విలువ చేసే పేలుడు పదార్థాలు కలకలం సృష్టించాయి. జైనథ్​ మండలంలోని 44వ జాతీయ రహదారిపై పిప్పర్​వాడ టోల్​ప్లాజా వద్ద గురువారం పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీ సంఖ్యలో పేలుడు పదార్థాలు పట్టుబడడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయంశంగా మారింది. 

కేసు వివరాలను ఎస్పీ అఖిల్​ మహాజన్​ పోలీస్​ హెడ్​క్వార్టర్స్​లో మీడియాకు వెల్లడించారు. పోలీసు​లు టోల్​ప్లాజా వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న రెండు వాహనాలలో పేలుడు పదార్థాలు పట్టుబడ్డాయి.

 బోలోరో వాహనంలో లైసెన్స్ లేకుండా అక్రమంగా తరలిస్తున్న రూ.20 లక్షల విలువ చేసే 20 వేల ఎలక్ట్రానిక్ డిటోనేటర్లు, 90 బూస్టర్లను, ఒక కారును, ఆరు సెల్​ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకోని ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. 

మరో ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌‌‌‌కు చెందిన రవికుమార్ అనే వ్యక్తి ద్వారా పేలుడు పదార్థాలను తీసుకున్నారు. ఇతరుల పేర్లపై బిల్లులు తీసుకొని, బూస్టర్ బాక్సుల్లో ఎలక్ట్రానిక్ డిటోనేటర్లను నింపి తెలంగాణకు తరలిస్తున్నట్లు తేలింది. పేలుడు పదార్థాలను కరీంనగర్​లోని క్రషర్లు, క్వారీలు, మైన్స్‌‌‌‌ కంపెనీలకు అధిక ధరలకు విక్రయించేందుకు తరలిస్తున్నట్లు గుర్తించారు. 

అరెస్టయిన వారిలో చెప్యాల పరశురాము, వల్లెపు తేజ, కదం శ్రావణ్, కస్తూరి సునీల్, సూర రంజిత్, కస్తూరి మధు కిరణ్, పాగల సంపత్ రెడ్డి ఉన్నారు. మరో ఇద్దరు నిందితులు ఎండీ.వాహిద్, రవికుమార్ పాత్రపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ సమావేశంలో డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, జైనథ్ సీఐ జి. శ్రావణ్, సీసీఎస్ ఇన్​స్పెక్టర్ చంద్రశేఖర్, ఎస్సై పి. గౌతమ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.