
అజయ్ దేవగన్, మాధవన్, జ్యోతిక లీడ్ రోల్స్‌లో ఓ హిందీ చిత్రం రూపొందుతోంది. క్వీన్, సూపర్ 30, గుడ్ బై లాంటి చిత్రాలను తీసిన వికాస్ బెహల్ దీనికి దర్శకుడు. ఇదొక సూపర్ నేచురల్ థ్రిల్లర్. ‘బ్లాక్ మేజిక్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అయితే ఈ సినిమాకు ‘సైతాన్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేస్తున్నట్టు ప్రకటించిన మేకర్స్, మార్చి 8న విడుదల చేయనున్నట్టు అనౌన్స్ చేశారు. గత ఏడాది ఫిబ్రవరిలో విడుదలై సక్సెస్ సాధించిన ‘వశ్’ అనే గుజరాతీ సినిమాకు ఇది రీమేక్.
వెకేషన్ కోసం మారుమూల గ్రామానికి వెళ్లిన కుటుంబం.. ఓ అపరిచిత వ్యక్తి కారణంగా చిక్కుల్లో పడతారు. అతను ప్రయోగించిన డార్క్ మేజిక్ నుంచి ఆ కుటుంబం ఎలా బయటపడింది అనేది అసలు కథ. ఒరిజినల్ మూవీలో ఇంపార్టెంట్ రోల్ చేసిన గుజరాతీ నటి జాంకీ బోడివాలా, హిందీలోనూ నటిస్తోంది. ఇక పాతికేళ్ల తర్వాత ఈ సినిమాతో తిరిగి బాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇస్తోంది జ్యోతిక. అజయ్ దేవగన్‌కు జంటగా ఆమె నటిస్తోంది. జియో స్టూడియోస్ సమర్పణలో అజయ్ దేవగన్, జ్యోతి దేశ్‌పాండే, అభిషేక్ పాఠక్ నిర్మిస్తున్నారు.