శంషాబాద్ ఎయిర్పోర్ట్లో హైటెన్షన్.. రన్వే పై ఉండగా మోగిన సెక్యూరిటీ అలారం

శంషాబాద్ ఎయిర్పోర్ట్లో హైటెన్షన్.. రన్వే పై ఉండగా మోగిన సెక్యూరిటీ అలారం
  • టెన్షన్​ పడిన ప్రయాణికులు 
  • ఓ ప్యాసింజర్​ను దించి పోలీసులకు అప్పగించిన సిబ్బంది
  • పొరపాటున ఎమర్జెన్సీ హ్యాండిల్​కు తాకడంతో ఘటన 

గండిపేట, వెలుగు :  దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌‌లోని టెల్ అవీవ్ కు వెళ్తున్న ఫ్లై దుబాయ్ విమానంలో ఇన్సిడెంట్​ను మర్చిపోకముందే శంషాబాద్​ఎయిర్​పోర్టులో గురువారం అర్ధరాత్రి జరిగిన ఓ ఘటన కలకలానికి దారి తీసింది. విమానం ఎమర్జెన్సీ డోర్​తీసేందుకు ప్రయత్నించాడంటూ ఓ ప్రయాణికుడిని సిబ్బంది కిందకు దించేసి పోలీసులకు అప్పజెప్పారు. ఈ ఘటనలో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. 

ఎమర్జెన్సీ అలారం మోగడంతో..

శంషాబాద్ ఎయిర్​పోర్ట్​నుంచి ఇండిగో విమానం ఏపీలోని కడపకు బయలుదేరేందుకు రన్​వేపై సిద్ధంగా ఉంది. అందరు ప్రయాణికులు లోపలకు వెళ్లి తమకు కేటాయించిన సీట్లలో కూర్చుంటున్నారు. మహారాష్ట్రకు చెందిన 35 ఏళ్ల దినేశ్​కు తొమ్మిదో వరుసలో సీటు కేటాయించారు. కానీ, బోర్డింగ్ ప్రాసెస్​లో సిబ్బంది అతడిని 2వ వరుసలో ఉన్న ఎమర్జెన్సీ ఎగ్జిట్ సీటులోకి మార్చారు. ఈ క్రమంలో ఎమర్జెన్సీ అలారం మోగింది. అప్రమత్తమైన సిబ్బంది అలారం మోగడానికి కారణం దినేశ్​అని తేల్చి కిందకు దించేశారు. ఎమర్జెన్సీ డోర్​ఓపెన్​చేయడానికి ప్రయత్నించి ఉండవచ్చని అనుమానించి సీఐఎస్ఎఫ్​సిబ్బందికి అప్పగించారు. వారు విచారణ కోసం పోలీసులకు అప్పగించారు.  

చెయ్యి తాకడం వల్లేనా? 

ఎమర్జెన్సీ డోర్​ఓపెన్​చేయడానికి యత్నించాడేమో అని విమాన సిబ్బంది ముందు అనుమానం వ్యక్తం చేయగా, అలాంటిదేమీ లేదని తెలుస్తున్నది. తనకు కేటాయించిన సీట్లో కూర్చుంటూ అడ్జస్ట్​చేసుకుంటుండగా చేయి ఎమర్జెన్సీ డోర్ హ్యాండిల్‌‌ను తాకడంతో సెక్యూరిటీ అలారం మోగిందని సమాచారం. పోలీసులు దినేశ్​ను ప్రశ్నించగా ‘తలుపు ఎలా పనిచేస్తుందో తెలియక, ఉద్దేశపూర్వకంగా కాకుండా కేవలం అనుకోకుండానే హ్యాండిల్ తాకా’ అని చెప్పినట్టు తెలిసింది. అతనికి ఎలాంటి చెడు ఉద్దేశం లేదని నిర్ధారించుకున్న పోలీసులు స్టేట్‌‌మెంట్ తీసుకుని వదిలేశారని తెలుస్తున్నది.

అయితే, విమానం రన్​వే పై నిలిచి ఉన్న టైంలోనే సెక్యూరిటీ అలారం మోగిందని, టేకాఫ్​తీసుకుంటుండగా ఎమర్జెన్సీ డోర్​ఓపెన్​చేసేందుకు ప్రయత్నించాడని సోషల్​మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని ఎయిర్​లైన్స్​ప్రకటించింది. కాగా, అలారం మోగిన తర్వాత సిబ్బంది దినేశ్​పై అరవడం..అతడు కూడా తిరిగి సిబ్బందిపై అరవడంతో కొంత గొడవ నెలకొన్నది.