శంషాబాద్‌‌ యాక్సిస్‌‌ బ్యాంకు  ఏటీఎం చోరీ చేసింది రాజస్థాన్ గ్యాంగ్..ప్రధాన నిందితుడు అరెస్ట్

శంషాబాద్‌‌ యాక్సిస్‌‌ బ్యాంకు  ఏటీఎం చోరీ చేసింది రాజస్థాన్ గ్యాంగ్..ప్రధాన నిందితుడు అరెస్ట్
  • అక్టోబర్ ​6న శంషాబాద్ లో గ్యాస్​ కట్టర్ ​తో కట్​ చేసి దోపిడీ
  • రూ.7.40 లక్షలు ఎత్తుకెళ్లిన దొంగలు  
  • ప్రధాన నిందితుడు అరెస్ట్​ రూ.4,500 స్వాధీనం 

గండిపేట, వెలుగు: శంషాబాద్‌‌ యాక్సిస్‌‌ బ్యాంకు ఏటీఎంను అక్టోబర్​6న గ్యాస్‌‌ కట్టర్‌‌తో కట్​చేసి సుమారు రూ.ఏడున్నర లక్షలు ఎత్తుకెళ్లిన దొంగల్లో ప్రధాన నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసు ఛేదించడంలో శంషాబాద్‌‌ పోలీసులకు రాజస్థాన్‌‌ పోలీసులు సహకరించారు. శంషాబాద్‌‌ జోన్‌‌ డీసీపీ బి.రాజేష్‌‌  వివరాలు వెల్లడించారు. అక్టోబర్‌‌ 6న తెల్లవారుజామున శంషాబాద్‌‌ పరిధిలోని సాతంరాయి యాక్సిస్‌‌ బ్యాంకు ఏటీఎంను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు గ్యాస్​కట్టర్​తో కట్​చేసి రూ.7.40 లక్షలు కొల్లగొట్టారు.

తాము దొరకూడదని చోరీకి ముందు సీసీటీవీ కెమెరాలపై పెయింట్‌‌ స్ప్రే చేసి, అలారం వైర్‌‌ కత్తిరించారు. శంషాబాద్​పీఎస్​లో కేసు నమోదు కాగా టాస్క్‌‌ఫోర్స్‌‌ పోలీసులతో కలిసి దర్యాప్తు చేపట్టారు. అయితే, మరో దొంగతనం చేయడానికి ప్రధాన నిందితుడు సిటీకి రాగా శంషాబాద్​గొల్లపల్లి ఎక్స్‌‌ రోడ్స్‌‌ వద్ద పోలీసులు వల వేసి పట్టుకున్నారు. అయితే, తమ గ్యాంగ్​అంతా డబ్బులను పంచుకోగా, తనకు రూ.90 వేలు వచ్చిందని, అందులో రూ.85,500 ఖర్చయ్యాయని, తన వద్ద రూ.4,500 మాత్రమే మిగిలాయని  నిందితుడు పోలీసులకు విచారణలో వెల్లడించాడు. నగదు,  కారు, బైక్​, గ్యాస్​కట్టర్​, సిలిండర్, సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. 

చోరీ చేశారిలా..

రాజస్థాన్‌‌కు చెందిన రషీద్‌‌ అలియాస్‌‌ కాకూ అలియాస్‌‌ యూసుఫ్‌‌ అలియాస్‌‌ కేకే (34)కు గతంలో ఏటీఎం చోరీల్లో పాల్గొన్న అనుభవం ఉంది. ఇతడిపై గురుగ్రామ్‌‌, ఢిల్లీ, ఫరీదాబాద్‌‌, రేవారీ తదితర ప్రాంతాల్లో దొంగతనాలు, ఇళ్లలో చోరీలు, ఆయుధాలు వాడడం వంటి  46 కేసులు నమోదయ్యాయి. ఇతడు తన సహచరులతో కలిసి హైదరాబాద్‌‌లో ఏటీఎం చోరీ చేయాలని ప్లాన్​వేశాడు. క్రైం చేయడానికి నెల ముందే రషీద్‌‌, మరో నిందితుడు షంషుద్దీన్‌‌ లారీలో గ్యాస్‌‌ కటింగ్​పరికరాలు, పెయింట్‌‌ స్ప్రే తీసుకొచ్చి పహాడీషరీఫ్‌‌ ప్రాంతంలోని పొదల్లో దాచిపెట్టారు. తర్వాత రషీద్‌‌తో పాటు సోహైల్‌‌, ఫైజాన్‌‌ అలియాస్‌‌ అయాన్‌‌, రెహాన్‌‌ అలియాస్‌‌ జాంగీ హైదరాబాద్‌‌కు చేరుకుని ముందుగా దాచిన పరికరాలను తీసుకున్నారు.

ఓ టూవీలర్​, కారు దొంగిలించి యాక్సిస్‌‌ బ్యాంకు ఏటీఎంకు వెళ్లారు. ఫైజాన్‌‌ సీసీటీవీ కెమెరాలపై స్ప్రే చేయగా, రషీద్‌‌ అలారం ఆఫ్​చేశాడు. సోహైల్‌‌, రెహాన్‌‌ ఏటీఎం కట్​చేశారు. తర్వాత కారులో పటాన్‌‌చెరు వైపు వెళ్లి కారును వదిలేసి పరారయ్యారు. అక్కడి నుంచి జహీరాబాద్‌‌, నాందేడ్‌‌, అమరావతి, అకోలా, ఇండోర్‌‌, కోటా మీదుగా రాజస్థాన్‌‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి వేర్వేరు ప్రాంతాలకు వెళ్లిపోయారు. చివరికి రషీద్​దొరకగా మిగిలిన వారు పరారీలో ఉన్నారు. టాస్క్‌‌ఫోర్స్‌‌ అడిషనల్​డీసీపీ కె.ఎస్‌‌.రావు, శంషాబాద్​ఏసీపీ వి.శ్రీకాంత్‌‌ గౌడ్‌‌ ఈ కేసును పర్యవేక్షించారు.