ఎనిమిదేళ్ల క్రితం ఆసుపత్రిలో పుట్టిన పాప మాయమవుతుంది.. అప్పటి నుంచి ఆ తల్లి తన కూతురు కోసం ఎదురుచూస్తూనే ఉంటుంది. ఇంతలో ఓ చిన్నారి ఆమె కళ్లపడుతుంది. ఆ పాపను చూడగానే తన తప్పిపోయిన కూతురే కావచ్చని అనుమానం మొదలవుతుంది. అసలు ఆ పాప ఎవరు? ఎనిమిదేళ్ల క్రితం మాయమైన చిన్నారి ఏమైంది? ఈ ప్రశ్నల చుట్టూ సాగే మిస్టరీ, సస్పెన్స్ థ్రిల్లర్ ‘షాక్’ (Shaque: Trust No One).
బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి రెన్సిల్ డి సిల్వా దర్శకత్వం వహించారు. జెన్నిఫర్ వింగెట్, సోనీ రాజ్దన్, అనుప్ సోనీ, తాహిర్ రాజ్ భాసిన్, సుమిత్ వ్యాస్, హర్లీన్ సేథి, ధ్రువ్ చౌదరీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మిస్టరీ, ఎమోషన్, ఫ్యామిలీ డ్రామాతో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతూ ఎంగేజ్ చేస్తుంది. మరి ఇంతకీ ఈ సినిమా కథేంటి? ఆడియన్స్ ను ఎంగేజ్ చేసే అంశాలు ఏం ఉన్నాయనేది ఓ లుక్కేద్దాం...
కథేంటంటే:
అన్విత (పరిణీతి చోప్రా), అలోక్ (తాహిర్ రాజ్ భాసిన్) దంపతులు సిమ్లాలో సంతోషంగా జీవిస్తుంటారు. అలోక్ కుటుంబానికి స్నేహితులైన డాక్టర్ భాస్కర్ (సుమిత్ వ్యాస్), ఆయన భార్య శ్రేయ (హర్లీన్ సేథీ) కూడా వారి జీవితంలో భాగంగా ఉంటారు. అన్వితకు పాప పుట్టడంతో ఆమెను భాస్కర్ పనిచేసే ఆసుపత్రిలో చేర్పిస్తారు. అక్కడ ‘అపేక్ష’ అనే పాపకు జన్మనిచ్చిన కొద్దిసేపటికే, నర్స్ వేషంలో వచ్చిన ఓ గుర్తుతెలియని మహిళ ఆ బిడ్డను ఎత్తుకెళ్లిపోతుంది. ఆసుపత్రిలోని కొన్ని సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో ఆమెను గుర్తించడం సాధ్యం కాదు. ఎనిమిదేళ్లు గడిచినా అన్విత మాత్రం తన కూతురు బతికి ఉందనే నమ్మకంతో ఆమె కోసం ఎదురుచూస్తూనే ఉంటుంది. ఈలోగా అలోక్‌తో ఆమెకు మరో పాప సిద్ధి పుడుతుంది.
మరోవైపు, అన్విత అత్త మాధురి రహస్యంగా ఓ మాంత్రికుడిని కలుస్తూ క్షుద్రపూజలు చేయిస్తుంటుంది. అదే సమయంలో భాస్కర్‌కు తెలియకుండా శ్రేయ, అన్వితకు తెలియకుండా అలోక్ రహస్య సంబంధాన్ని కొనసాగిస్తుంటారు. శ్రేయ నందిని అనే ఓ చిన్నారిని శరణాలయంలో ఉంచి చదివిస్తుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో గౌరవ్, సాక్షి దంపతులు తమ కుమార్తె రియాతో సిమ్లాకు రావడంతో కథ కొత్త మలుపు తిరుగుతుంది. రియాను చూడగానే ఆమె తన తప్పిపోయిన కూతురు అపేక్ష కావచ్చని అన్విత అనుమానిస్తుంది. ఆ దంపతులపై నిఘా పెట్టాలని పోలీస్ అధికారి ఖురానాను ఆశ్రయిస్తుంది. ఇంతకీ అపేక్షను కిడ్నాప్ చేసింది ఎవరు? ఎందుకు? ఎనిమిదేళ్లుగా దాగి ఉన్న ఈ రహస్యం బయటపడుతుందా? తన కూతురిని తిరిగి పొందేందుకు అన్విత చేసే పోరాటం ఎక్కడికి దారితీస్తుంది? అనేదే మిగతా కథ.
మూవీ ఎలా ఉందంటే?
‘షాక్’ను పూర్తిగా మిస్టరీ, సస్పెన్స్‌పై నడిచే థ్రిల్లర్‌గా చెప్పొచ్చు. మొదటి నుంచే తప్పిపోయిన చిన్నారి చుట్టూ కథను అల్లడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఎనిమిదేళ్ల క్రితం జరిగిన కిడ్నాప్‌కు, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలకు ఉన్న సంబంధాన్ని తెలుసుకోవాలనే క్యూరియాసిటీని దర్శకుడు కొనసాగించాడు.
పరిణీతి చోప్రా పోషించిన అన్విత పాత్రలో మాతృత్వం, బాధ, ఆందోళన, కూతురిని ఎలాగైనా తిరిగి పొందాలనే తపన కనిపిస్తుంది. కూతురు కనిపించకుండా పోయిన తర్వాత కూడా ఆమె బతికే ఉందనే నమ్మకంతో అన్విత ఎదురుచూసే సన్నివేశాలు ఎమోషనల్‌గా అనిపిస్తాయి. తాహిర్ రాజ్ భాసిన్, సుమిత్ వ్యాస్, హర్లీన్ సేథి తదితరులు తమ పాత్రల పరిధిలో ఆకట్టుకున్నారు.
అయితే కథలో మిస్టరీ అంశాలు ఎక్కువగా ఉన్నప్పటికీ, వాటిని బయటపెట్టే విధానం కొన్ని చోట్ల నెమ్మదిగా అనిపిస్తుంది. ఒకదాని తర్వాత ఒకటి వచ్చే ట్విస్టులు ప్రేక్షకుడిని చివరి వరకు కథతో ప్రయాణించేలా చేసినా, కొన్ని మలుపులు ముందుగానే ఊహించే అవకాశం ఉంటుంది. ఫ్యామిలీ డ్రామా, అక్రమ సంబంధాలు, క్షుద్రపూజలు, కిడ్నాప్ మిస్టరీ వంటి అంశాలను ఒకే కథలో కలపడంతో కథనం కొంత గందరగోళంగా అనిపించే సందర్భాలు ఉన్నాయి.
మొత్తంగా చూస్తే.. కూతురిని కోల్పోయిన తల్లి తన బిడ్డ కోసం చేసే అన్వేషణకు మిస్టరీ, థ్రిల్లర్ ఎలిమెంట్స్ జోడించిన కథ ‘షాక్’. ఓపికగా మిస్టరీ థ్రిల్లర్స్ చూసేవారికి ఈ సినిమా ఒకసారి ప్రయత్నించవచ్చు. పరిణీతి చోప్రా నటన, కథలోని ట్విస్టులు, చివరి వరకు కొనసాగించే సస్పెన్స్ ఈ సినిమాకు ప్రధాన బలాలు.
