శీతల్ దేవికి మరో స్వర్ణం.. వరుసగా రెండో గోల్డ్.. సింగపూర్ ఆర్చర్‌పై ఘన విజయం!

శీతల్ దేవికి మరో స్వర్ణం.. వరుసగా రెండో గోల్డ్.. సింగపూర్ ఆర్చర్‌పై ఘన విజయం!

Sheetal Devi: జపాన్‌లో జరుగుతున్న ఆసియా పారా గేమ్స్ 2026 (Asian Para Games 2026) లో భారత స్టార్ ఆర్చర్, కాళ్లలో విల్లంబులు ఎక్కుపెట్టే అద్భుత ప్రతిభాశాలి శీతల్ దేవి (Sheetal Devi) తన అసాధారణ ఫామ్‌ను కొనసాగిస్తోంది. ఓకాజాకి చుఓ సోగో పార్క్ కాంప్లెక్స్‌లో ఈరోజు (2026, అక్టోబర్ 22, గురువారం) జరిగిన మహిళల కాంపౌండ్ ఇండివిజువల్ (Women's Compound Individual) ఈవెంట్ ఫైనల్లో శీతల్ దేవి అద్భుత కమ్‌బ్యాక్‌తో స్వర్ణ పతకాన్ని సాధించింది. టోమన్ కుమార్‌తో కలిసి కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో పసిడి పతకం గెలిచిన కొన్ని గంటల వ్యవధిలోనే బరిలోకి దిగిన 19 ఏళ్ల శీతల్ దేవి, సింగపూర్ అథ్లెట్ అలీమ్ నూర్ షాహిదాను 142-139 తేడాతో ఓడించి రికార్డు స్థాయిలో రెండో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.

మెరుపు కమ్‌బ్యాక్:
 
ఈ హోరాహోరీ ఫైనల్ మ్యాచ్ ప్రారంభంలో శీతల్ దేవి తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంది.  తొలి రెండు రౌండ్ల (Ends) ముగిసేసరికి సింగపూర్ ఆర్చర్ అలీమ్ ఏకంగా 4 పాయింట్ల ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ శీతల్ ఏమాత్రం పట్టుదలను కోల్పోలేదు.. తదుపరి రెండు రౌండ్లలో వరుసగా ఆరు 10లు (మూడు Xs తో సహా) ఎక్కుపెట్టి బుల్‌సైను తాకింది. దీంతో రెండు రౌండ్ల వ్యవధిలోనే 2 పాయింట్ల ఆధిక్యంలోకి వెళ్ళింది.

ఒత్తిడిని జయించి స్వర్ణ జయభేరి: 

చివరి మూడు బాణాలలో శీతల్ మూడు 9 పాయింట్లతో మొత్తం 27 పాయింట్లు సాధించింది. ఒత్తిడిలో బరిలోకి దిగిన సింగపూర్ క్రీడాకారిణి అలీమ్ 9, 8, 9 పాయింట్లతో కేవలం 26 పాయింట్లు మాత్రమే సాధించగలిగింది. దీంతో 142-139 తేడాతో శీతల్ దేవి వరుసగా రెండో ఆసియా పారా గేమ్స్‌లోనూ పసిడిని కైవసం చేసుకుంది. 

ప్రస్తుత గేమ్స్‌లో శీతల్ ఖాతాలో 3 పతకాలు: 

* కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్: స్వర్ణ పతకం (గోల్డ్)

* కాంపౌండ్ ఇండివిజువల్: స్వర్ణ పతకం (గోల్డ్)

* మహిళల డబుల్స్: రజత పతకం (ఒడిశాకు చెందిన నాలుగు అవయవాలు లేని పాయల్ నాగ్‌తో కలిసి)