మీరు మనుషులు కాదు రాక్షసులు అనటానికి ఇంత కంటే ఎగ్జాంపుల్ ఏముంటుందీ.. సనాతన ధర్మం అని గర్వంగా భజన చేసుకుంటున్న మనం.. మనుషులను మాత్రం రాక్షసుల్లా తయారు చేస్తున్నాం. దేవుడు అంటే భయం లేదు భక్తి అంతకన్నా లేదు.. అది పవిత్రమైన శివాలయం అన్న సంగతే మర్చిపోయాడు ఈ రాక్షసుడు. అంతేనా గర్భ గుడిలో.. కళ్లెదుట శివ లింగం కనిపిస్తున్నా ఏ మాత్రం బెరకు లేదు.. గర్భ గుడిలోనే దేవుడి సమక్షంలో.. ఓ బాలికపై అత్యాచారానికి ప్రయత్నించాడు ఆ ఉన్మాది. ఈ మొత్తం వ్యవహారం సీసీ కెమెరాలో రికార్డ్ కావటం.. అది కూడా మహారాష్ట్రం రాష్ట్రం పూణేలో జరగటం ఇప్పుడు దేశం మొత్తం నివ్వెరపోతుంది. ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే..
మహారాష్ట్రలోని పూణేలో జరిగిన ఒక అఘాయిత్యం నోరెళ్లబెట్టేలా చేసింది ప్రతి ఒక్కరినీ. పింప్రి-చింఛ్వాడ్ నగర పరిధిలోని నిగ్డీ ప్రాంతంలో ఉన్న ఒక శివాలయంలో ఒంటరిగా పూజలు చేసుకుంటున్న 10 ఏళ్ల చిన్నారిపై కాంట్రాక్ట్ కార్మికుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. పూజలు ముగించుకుని బాలిక బయటకు వస్తున్న సమయంలో.. నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులు ధరించే ఆరెంజ్ కలర్ జాకెట్ వేసుకున్న నిందితుడు గుడిలోకి ప్రవేశించాడు. బాలిక ఒంటరిగా ఉండటాన్ని గమనించిన ఆ వ్యక్తి.. ఒక్కసారిగా ఆమె చేయి పట్టుకుని బలవంతం చేయడానికి యత్నించాడు. అయితే ఆ చిన్నారి ఏమాత్రం భయపడకుండా వెంటనే అతన్ని గట్టిగా తోసేసి అక్కడి నుంచి తప్పించుకుంది.
ఈ హేయమైన ఘటనకు సంబంధించిన దృశ్యాలు గుడిలోని సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. బాధితురాలు భయంతో వణికిపోతూ కన్నీరు పెట్టుకోవడం, నిందితుడు అక్కడి నుంచి పారిపోవడం ఆ వీడియోలో క్లియర్ గా కనిపించింది. కొద్దిరోజుల తర్వాత ఈ సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానికంగా ప్రజా ఆగ్రహం వ్యక్తమైంది. పవిత్రమైన పుణ్యక్షేత్రంలోనే చిన్నారికి రక్షణ లేకుండా పోయిందంటూ ప్రజలు, మహిళా సంఘాలు నిరసనలు వ్యక్తం చేశాయి. సోషల్ మీడియాలో దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో పోలీసులు రంగంలోకి దిగారు.
సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన నిగ్డీ పోలీసులు, మెట్రో నిర్మాణ పనుల్లో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్న విశాల్ సింగ్ అనే నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్ మహేష్ బన్సోడే ఆధ్వర్యంలో ఈ కేసను సీరియస్గా తీసుకున్న పోలీసులు, నిందితుడిపై లైంగిక వేధింపులతో పాటు పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఈ ఘటనతో ప్రార్థనా మందిరాల్లో మహిళలు, చిన్నారుల సేఫ్టీపై ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి.
