వైరల్ వీడియో: కన్న కూతురిపై తండ్రి శాడిజం.. కాళ్లతో తంతూ పైశాచికం

వైరల్ వీడియో: కన్న కూతురిపై తండ్రి శాడిజం.. కాళ్లతో తంతూ పైశాచికం

భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం సారపాకలో కన్న కూతురిని కర్కశంగా కాలుతో తన్ని భయభ్రాంతులకు గురిచేసిన తండ్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఐటీసీలో పనిచేస్తున్న నిందితుడు తన మైనర్ అయిన తన కూతురి పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. ఆ బాలిక ధైర్యంగా 1098 చైల్డ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. సారపాకలో నివాసముంటున్న ఓ వ్యక్తి తన కన్న కూతురిని కాలితో తన్ని, చిత్రహింసలకు గురిచేశాడు. కన్న కూతురు అనే కనీస కనికరం లేకుండా రాక్షసుడిలా ప్రవర్తించాడు. కన్న తండ్రి దాష్టికానికి ఆ బాలిక భయంతో బెంబేలెత్తిపోయింది. తండ్రి వేధింపులు భరించలేకపోయిన ఆ బాలిక, తన గోడును చైల్డ్ హెల్ప్‌లైన్ నంబర్ 1098కు తెలియజేసింది. బాలిక ఫిర్యాదును స్వీకరించిన చైల్డ్ హెల్ప్‌లైన్ అధికారులు వెంటనే స్పందించారు. ఈ ఘటనపై ఐసిడిఎస్ (ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ సర్వీసెస్) సూపర్ వైజర్ సక్కుబాయి విచారణ చేశారు. బాలికను కలిసిన సక్కుబాయి, పూర్తి వివరాలను సేకరించారు. తండ్రి చేసిన దాడిని బాలిక వివరించడంతో, సక్కుబాయి ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. బాలికకు న్యాయం జరగాలని, ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా చూడాలని సంకల్పించారు.

విచారణ అనంతరం, ఐసిడిఎస్ సూపర్ వైజర్ సక్కుబాయి.. బూర్గంపాడు పోలీస్ స్టేషన్‌లో నిందితుడైన బాలిక తండ్రిపై ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. బాలికపై జరిగిన దాడిని పోలీసులు సీరియస్‌గా పరిగణించారు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ ఘటన చిన్నారులపై జరిగే గృహ హింసపై మరోసారి చర్చను లేవనెత్తింది. బాలిక ధైర్యంగా ఫిర్యాదు చేయడం అభినందనీయం అని పలువురు సదరు బాలికను ప్రశంసించారు. పిల్లలు హింసకు గురైనప్పుడు ధైర్యంగా బయటపడి ఫిర్యాదు చేయాలని, అప్పుడే ఇలాంటి ఘటనలను అరికట్టవచ్చని అధికారులు సూచించారు. ఈ దుశ్చర్యకు సంబంధించిన వీడియో చూస్తే మానవత్వం ఉన్న ఎవరికైనా గుండె తరుక్కుపోతుంది. ఆ కన్నతండ్రిపై పీకల దాకా కోపం రావడం ఖాయం.