తొగుట, వెలుగు: ధాన్యం, బియ్యం అక్రమాల నిగ్గు తేల్చేందుకు సివిల్ సప్లై విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు రైస్ మిల్లుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంగళంపల్లిలోని ఓ రైస్ మిల్లుపై దాడులు నిర్వహించిన విజిలెన్స్ అధికారులు.. పెద్ద మొత్తంలో పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి అక్కడ నిల్వ ఉంచుతున్నట్టు గుర్తించారు.
విజిలెన్స్ అధికారులు ఆ బియ్యం ఎక్కడ నుంచి వస్తున్నాయనే దానిపై ఆరా తీయగా సిద్దిపేట జిల్లా అక్బర్ పేట– భూంపల్లి మండలం మోతె గ్రామంలోని భారతీ రైస్ ఇండస్ట్రీస్ పేరు బయటపడ్డట్టు సమాచారం. ఈ మేరకు విజిలెన్స్ అధికారులు సదరు రైస్‌మిల్లులో తనిఖీ చేపట్టగా సీఎంఆర్ కోసం ఆ రైస్ మిల్లుకు సరఫరా చేసిన ధాన్యంలో పెద్ద మొత్తంలో షార్టేజీ ఉండటంతోపాటు, 25, 50 కిలోల బియ్యం బస్తాలు వందల సంఖ్యలో ఉన్నట్టు గుర్తించారు. ఈ మేరకు ఉన్నతాధికారులకు నివేదిక పంపించామని, వారి అదేశాలకు అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ అధికారులు తెలిపారు.
