5 నిమిషాల్లో సర్జరీ.. లక్ష మందికి కంటి చూపు.. విల్లేజ్ డాక్టర్ ఇన్స్పైరింగ్ స్టోరీ !

5  నిమిషాల్లో సర్జరీ.. లక్ష మందికి కంటి చూపు.. విల్లేజ్ డాక్టర్ ఇన్స్పైరింగ్ స్టోరీ !

టైటిల్ చూసి ఆశ్చర్యపోయారు కదా! ఐదు నిమిషాల్లో సర్జరీ ఏంటి..? కంటి సర్జరీ చేయాలంటే కనీసం ఒకరోజు ముందు అడ్మిషన్, సర్జరీ తర్వాత ఒకరోజు అబ్జర్వేషన్.. ఇలా చెప్పకుంటే తక్కువలో తక్కువ మూడు రోజుల ప్రాసెస్. కానీ ఐదు నిమిషాల్లో ఫినిష్ చేయడమేంటని అనుకోకండి. నేపాల్ లో అలాంటి డాక్టర్ ఒకరు ఉన్నారు. దాదాపు లక్ష మందికి కంటి చూపు ప్రసాదించిన డాక్టర్‌‌ను తమ పాలిట దేవుడిగా చెప్పుకుంటున్నారు. అంత ఫాస్ట్ గా సర్జరీ చేసేంత స్పెషాలిటీ ఏంటో.. ఆ డాక్టర్ వివరాలు ఏంటో తెలుసుకుందాం. 

నేపాల్ లోని ఒక మారుమూల ప్రాంతం. స్కూల్ కు వెళ్లాలంటే వారం రోజులు నడవాలి. అంత దూరంలో ఉండేది పాఠశాల. కరెంటు, ఆరోగ్య సదుపాయాలు లేని గ్రామంలో పెరిగిన సందూక్ రూయిట్.. పరిస్తితులే తనను చరిత్రలో నిలిచిపోయేలా చేశాయని చెప్తుంటారు. రూయిట్ కు 17 ఏళ్ల వయసులో తన సోదరి క్షయ వ్యాధితో చనిపోవడం తన జీవిత గమనాన్నే మార్చేసిందట. ఒలాంగ్చుంగ్ గోలాలో పెరిగిన బాలుడు.. ప్రపంచంలోనే అత్యంత పాపులర్, సెలబ్రేటెడ్, ఆరాధ్య వైద్యుడిగా చరిత్రకెక్కడం మామూలు విషయం కాదుగా మరి.

చూపునిచ్చే దేవుడు:

డా.సందూక్ రూయిట్ ను చూపునిచ్చే దేవుడిగా ప్రపంచం అంతా పిలుచుకుంటుంది. ఆసియా, ఆఫ్రికా దేశాలలో దాదాపు లక్ష మందికి సర్జరీ ద్వారా చూపునిచ్చి చరిత్ర సృష్టించాడు. తక్కువ ఖర్చులో, ఎక్కువ క్వాలిటీతో కాటరాక్ట్ సర్జరీ టెక్నిక్ కనిపెట్టి సక్సెస్ అయ్యారు. స్ట్రిచ్ ఫ్రీ సర్జరీ.. అంటే కుట్లు వేయకుండానే చేసే ఈ టెక్నిక్ ఆయనను ప్రపంచ వ్యాప్తంగా కీర్తినందుకునేలా చేసింది. 

1994లో ఆస్ట్రేలియా కంటి వైద్యులు ఫ్రెడ్ హాలోస్ పరిచయంతో ఈయన జీవితమే మారిపోయింది. ఇండియాలో మెడిసిన్ పూర్తి చేసుకున్న తర్వాత హాలోస్ ను కలవటంతో ఆయన ప్రపంచ వైద్యుడిగా మారిపోయారు. ఆయనతో కలిసి ఖాట్మండులో తిల్ గంగా అనే కంటి ఆసుపత్రి పెట్టి.. నేపాల్ ప్రజలకు ప్రపంచ స్థాయి కంటి వైద్యం అందిచడం మొదలుపెట్టారు. వీరి ఆధ్వర్యంలో కాటరాక్ట్, మయోపియా కు సంబంధించిన లెన్స్ ప్రపంచంలోని 30 దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. 

ప్రపంచంలో పట్టణాలకు వెళ్లలేని మారుమూల గ్రామాలకు వైద్యం అందాలి.. కంటి చూపుతో ఎవరూ బాధపడకూడదనేదే ఆయన లక్ష్యం. అందులో భాగంగా నేపాల్ తో పాటు, భూటాన్, మయన్మార్, నార్త్ కొరియా, ఇండోనేషియా తదితర దేశాలలోని గ్రామీణులకు తక్కువ ఖర్చుతో ఐదు నిమిషాల సర్జరీ చేసి కంటి చూపు ప్రసాదించారు. ఇప్పుడు లక్షల మంది ఆయన చలవతో ప్రపంచాన్ని చూడగల్గుతున్నారు.