ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారా..? ఈ లక్షణాల్లో ఒక్కటి కనిపించినా.. డేంజర్లో ఉన్నట్టే..!

ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారా..? ఈ లక్షణాల్లో ఒక్కటి కనిపించినా.. డేంజర్లో ఉన్నట్టే..!

మన దేశంలో పిల్లలు పేగు సంబంధిత అనారోగ్యం బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తుంది. ఆహారపు అలవాట్లు క్రమబద్ధంగా లేకపోవడం, మొబైల్స్, టీవీలు.. ఇలా గంటల కొద్దీ పిల్లలు స్క్రీన్ చూస్తూ గడిపేయడం, బయటకు వెళ్లి ఆడుకునేందుకు ఆసక్తి చూపించకపోవడం.. ఇలా పలు కారణాలు పిల్లల పేగు ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయని పీడియాట్రిక్ గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు చెబుతున్నారు. జీర్ణాశయం విధి ఆహారాన్ని జీర్ణం చేయడం మాత్రమే అని చాలా మంది అనుకుంటారు.

కానీ.. జీర్ణాశయం ఈ ప్రథమ కర్తవ్యంతో పాటు ఇంకా చాలానే చేస్తుంది. జీర్ణవ్యవస్థలో ఉండే సూక్ష్మజీవులు ఆహారాన్ని అరిగేలా చేయడానికి, పోషకాలను గ్రహించడానికి, హానికరమైన జీవులను దూరంగా ఉంచడానికి సహాయపడతాయి. శరీరం పెరుగుతూ, పిల్లలు ఎదుగుతున్న క్రమంలో.. ఈ సూక్ష్మజీవుల ఆరోగ్యకరమైన సమతుల్యతను కాపాడుకోవడం ఎంతో ముఖ్యమని డాక్టర్లు వివరించారు.

పిల్లల డైలీ రొటీన్ అప్పటి రోజులతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా మారిపోయింది. ఈ క్రమంలో పిల్లలపై ఒత్తిడి పెరిగిపోతుంది. ప్యాక్ చేసిన ఫుడ్, చక్కెరతో తయారుచేసిన స్నాక్స్‌ను తరచుగా తినడం, స్క్రీన్‌కు అడిక్ట్ అయి ఎక్కువ సమయం కేటాయించడం, శారీరక శ్రమ తగ్గడం, ఆడుకునే పరిస్థితులు లేకపోవడం, ఒకవేళ ఆడుకునేందుకు అవకాశమున్నా ఆసక్తి లేకపోవడం.. ఇవన్నీ పేగులోని సూక్ష్మజీవుల సమతుల్యతను ప్రభావితం చేసే అంశాలని డాక్టర్లు వివరించారు. యాంటీబయాటిక్స్‌తో సహా మందులను తరచుగా లేదా అనవసరంగా వాడటం కూడా సూక్ష్మజీవుల సమతుల్యతపై  ప్రభావం పడుతుంది.

జీర్ణాశయ సంబంధిత అనారోగ్య సమస్యలకు కడుపు నొప్పి ఒక్కటే లక్షణం కాదు. త్వరగా కడుపు నిండినట్లు అనిపించడం, మలవిసర్జన అలవాట్లలో మార్పులు లేదా ఆకలి తగ్గడం వంటి లక్షణాలు కూడా పేగు సంబంధిత సమస్యలకు సంకేతాలు. జీర్ణ సంబంధిత లక్షణాలతో పాటుగా ఎప్పుడూ పిల్లలు నీరసంగా అలసిపోయినట్లు ఉండటం, తరచుగా అనారోగ్యం, ఏ విషయంపై దృష్టి పెట్టకపోవడం, మానసిక స్థితిలో ఊహించని మార్పులు.. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే తల్లిదండ్రులు అస్సలు నిర్లక్ష్యం చేయొద్దని డాక్టర్లు చెబుతున్నారు.

పీచుపదార్థాలు అధికంగా ఉండే ఫుడ్ పిల్లలకు తినిపించాలి. పేగులో కూడా పనికొచ్చే బ్యాక్టీరియా ఉంటుంది. ఈ బ్యాక్టీరియాకు మనుగడకు సాయపడేలా ఓట్స్, ఆపిల్స్, బ్రోకలీ వంటి ఆహారాలను పిల్లలకు తినిపించడం ఎంతో ముఖ్యం. కొంతమంది పిల్లలు అస్సలు పెరుగు తినరు.

పెరుగు వాసన చూస్తేనే ఆమడ దూరం వెళ్లిపోతుంటారు. కానీ.. పెరుగు పిల్లలు ఆరోగ్యంగా ఉండేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. చిన్నచిన్న అనారోగ్య సమస్యలు పిల్లల్లో కనిపిస్తే ఉదాహరణకు జలుబు, దగ్గు లాంటివి.. వెంటనే మందులు వాడటం మంచిది కాదు. అవసరమైనప్పుడు అవి ముఖ్యమైన మందులే. కానీ.. అనవసరంగా వాడటం వల్ల గట్ మైక్రోబయోమ్ ప్రభావితం కావచ్చు.